జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీజేపీ సీఎం ట్రాప్ వేసింది. ఆయనను ఆయన వర్గాన్ని… ఆయన ఫ్యాన్స్‌ను మొత్తంగా బీజేపీవైపు మళ్లించే ట్రాప్ వేసింది. దీనికి పవన్ కల్యాణ్ పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆయన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారం రోజుల పాటు పవన్ ప్రచారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జనసైనికుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోది.
పవన్‌పై ఇప్పుడే అంత ప్రేమ ఎందుకు..!?
తిరుపతిలో జరిగిన బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొగిడిన తీరు చూసి జనసైనికులు కూడా తేడాగా ఉందే అనుకున్నారు. ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్‌ను పువ్వుల్లో పెట్టి చూసుకోమన్నారని .. దానికి తాము రెడీగా ఉన్నామని ఆయన నెక్ట్స్ లెవల్ పొగడ్తలు వినిపించారు. నిజానికి పొత్తులు పెట్టుకున్న తర్వాత బీజేపీ, జనసేన మధ్య పరిస్థితులు అంత సజావుగా లేవు. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా చెప్పడానికి సోము వీర్రాజు గతంలో మొహమాట పడ్డారు. బీసీ సీఎం అని.. మరొకటని ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు.. మాత్రం మోడీ మాటగా.. సీఎం పవన్ అంటున్నారు.
పవన్ ఫ్యాన్స్.. బలిజ వర్గం ఓట్ల కోసమే గురి..!
తిరుపతిలో పోటీ చేయడానికి జనసేన ఆసక్తి చూపింది. అక్కడ సంప్రదాయంగా జనసేనకు ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి బీజేపీ పోటీ చేస్తోంది. దీంతో జనసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గంలోని తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా జనసేన అభ్యర్ధి అయితేనే ఓటు వేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఓవీ రమణ అనే బలిజ వర్గం బీజేపీ నేతను అవమానించి పార్టీ నుంచి పంపేశారు సోము వీర్రాజు. ఇది కూడా ఆ వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో అసంతృప్తికి గురైన బలిజ ఓటర్లును బుజ్జగించటానికి సోము వీర్రాజు పవన్ కల్యాణ్‌ను వాడారు.
రేపు ఎక్కువ ఓట్లొస్తే జనసేనను మరింత తగ్గించే అవకాశం..!
గత ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికలతో పాటు పోటీ చేసిన అన్ని స్ధానాల్లో బిజెపి డిపాజిట్లను కోల్పోయింది. పైగా రాష్ర్టంలో నోటా కంటే బిజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వారి బలం ఏమీ పెరగలేదు. ఉన్న మార్పల్లా ఒక్కటే.. అదే పవన్‌తో పొత్తు. పవన్‌ను దువ్వితే జనసైనికులు తమకు ఓట్లు వేస్తారని, ఆ ఓట్లతో రాష్ర్టంలో తమ బలం పెరిగిందని బిజేపీ చెప్పుకునేందుకు ప్లాన్ గీసింది. ఇప్పుడు జనసేన మద్దతుతో బీజేపీకి లక్షో..రెండు లక్షలో ఓట్లు వస్తే.. తమ బలం అనిచెప్పి.. రేపు జనసేనను బీజేపీ మరింత పరిమితం చేస్తుంది. బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరించే విధానం అలాగే ఉంటుంది.జనసేనతోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. మరి జనసేన తెలివిగా రాజకీయం చేయగలుగుతుందా..?