టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయకుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు పవన్ కల్యాణ్. ఒక్కో సినిమాకీ పవన్ తీసుకొనే పారితోషికం రూ18 కోట్లకు పైమాటే. అలాంటిది పవన్ కల్యాణ్ అప్పుల్లో ఉన్నాడంటే నమ్ముతారా?? అవును.. పవన్ బ్యాంకు బ్యాలెన్సులు ప్రస్తుతానికి ఖాళీ అయ్యాయి. తన స్నేహితుడు, నిర్మాత శరత్ మారార్కి పవన్ బాకీ పడినట్టు టాక్ నడుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన మెర్సిడెజ్ బెంజ్ కారు కూడా పవన్ అమ్మేశాడని టాక్. పవన్ తన ఆర్థిక లావాదేవీల గురించి చాలాసార్లు చెప్పాడు. డబ్బులకు ఇబ్బందిగా ఉందని, తన సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా కష్టమైపోతోందని వాపోయాడు. అప్పుడే పవన్ అభిమానులు తొలిసారి షాక్ తిన్నారు. జనసేన పార్టీ కార్యకలాపాలు ఏం మొదలెట్టకముందే పవన్ ఇలా ఖాళీ అయిపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
డబ్బు విషయం పవన్ పెద్దగా పట్టించుకోడని, రేణూ దేశాయ్ తో విడాకులు తీసుకొన్నప్పుడు రూ.40 కోట్ల వరకూ భరణంగా చెల్లించాడని, అందుకే అప్పుల పాలయ్యాడని తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్‌కి తీసుకొన్న పారితోషికంలో కొంతభాగం.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక తిరిగిచ్చేశాడట. అందుకే పవన్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొన్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో సినిమా అతి త్వరగా సెట్స్‌పైకి పవన్ తాపత్రయపడడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. ఆ సినిమా మొదలైతే పారితోషికంగా కొంత డబ్బు వస్తుందని, ఇబ్బందులు తీరతాయని.. పవన్ భావిస్తున్నాడట. పాపం.. పవర్ స్టార్ పరిస్థితి ఇలా ఉంది.