సినిమాలలో, రాజకీయాలలో కనిపించే పవన్ కళ్యాణ్ కి నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ కి చాలా తేడా ఉంటుందని అయన అభిమానులకి, సన్నిహితులందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఎటువంటి బేషజాలు లేకుండా అందరితో చాలా ఆప్యాయంగా, మర్యాదగా మాట్లాడుతుంటారు. చాలా నిరాడంబరంగా గడుపడానికి ఇష్టపడతారు. ఆయనకి సాహిత్యం, ప్రకృతి అంటే ఎంత మక్కువో తెలిపే రెండు సంఘటనలు ఇవ్వాళ్ళ బయటపడ్డాయి.
గుంటూరు శేషేంద్ర శర్మ వ్రాసిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ తన స్వంత డబ్బుతో పునర్ముద్రిస్తున్నారు. ఆ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. ఆ పుస్తకాన్ని తనకి పరిచయం చేసినందుకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, పుస్తకం పునర్ముద్రణకి అంగీకరించినందుకు శేషేంద్ర శర్మగారి కుమారుడుకి కృతజ్ఞతలు తెలుపుకొంటూ పవన్ కళ్యాణ్ వ్రాసిన ఒక లేఖ ఎలాగో బయటపడటంతో పవన్ కళ్యాణ్ కి సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి గురించి అందరికీ తెలిసింది.
గోపాలా గోపాలా సినిమా దర్శకుడు డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాకి శరద్ మురార్ నిర్మిస్తున్నారు. ఆ సినిమా స్క్రిప్ట్ గురించి చర్చించేందుకు నిర్మాత శరద్ మురార్ ఫాం హౌస్ కి వెళితే అక్కడ పవన్ కళ్యాణ్ ఒక గొడుగు పట్టుకొని నిలబడి ఆవులని మేపుతూ కనిపించారు. అది చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే ఒక ఫోటో తీసి ట్విట్టర్ లో పెట్టేశారు. సినిమాలలో ఎంతో ఎనర్జిటిక్ గా, రాజకీయాలలో ఎంతో ఆవేశపరుడుగా కనిపించే పవన్ కళ్యాణ్ నిరాడంబరంగా ఉంటారంటే నమ్మలేనివారు ఈ ఫోటో చూస్తే నమ్మి తీరుతారు. ఇదివరకు ఒకసారి మామిడి చెట్లకు గొప్పులు తీస్తున్న ఒక ఫోటో ఇలాగే అందరినీ ఆకట్టుకొంది.