జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యంగా తాను క్వారంటైన్లోకి వెళ్తున్నట్లుగా ప్రకటించారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి వైరస్ సోకిందని అందుకే తాను.. వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్లోకి వెళ్తున్నట్లుగా సందేశం పంపించారు. నిజానికి ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని మాత్రమే ఐసోలేషన్‌కు పంపుతున్నారు. వారి కాంటాక్ట్స్‌ను టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తున్నారు కానీ క్వారంటైన్‌కు వెళ్లాలని చెప్పడం లేదు. పాజిటివ్‌ల కాంటాక్టులు అందరూ… టెస్టులు చేయించుకుని నెగెటివ్ వస్తే యథావిధిగా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అయితే పవన్ మాత్రం తాను క్వారంటైన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
పవన్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోడం బీజేపీకి షాక్ ఇచ్చింది. అయితే పవన్ కల్యాణ్.. బీజేపీపై తీవ్ర అసంతృప్తితోనే ఈ క్వారంటైన్ నిర్ణయ తీసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తన సినిమాను రాజకీయంగా టార్గెట్ చేసి.. ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నా బీజేపీ నేతలు… మరింతగా రాజకీయం చేశారే తప్ప… రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి టిక్కెట్ ధర విషయంలో వెనక్కి తగ్గేలా చేయడంలో బీజేపీ నేతలు చొరవ తీసుకోలేదని పవన్ కల్యాణ్ అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు. నిజానికి బీజేపీ నేతలు చెబితే.. జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదని చాలా మందికి నిశ్చితాభిప్రాయం. ఆర్థికంగా నష్టం కలిగించే ప్రయత్నాలను అడ్డుకోకపోవడం.. కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా… జనసేన అధినేతకు ఎలాంటి సహకారం అందించకపోవడం జనసేనలో చర్చకు కారణం అవుతోంది.
అదే సమయంలో బీజేపీ అగ్రనేతలెవవరూ బీజేపీ ప్రచారానికి రావడం లేదు. మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్‌లు వస్తే వచ్చినట్లుగా లేకపోతే లేనట్లుగా భావిస్తారు. అయితే ప్రజల్లో గుర్తింపు పెద్దగా లేని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తున్నారు. ఆయనతో పాటు పవన్ పాల్గొనాలని అనుకున్నారు. తిరుపతి ప్రచారంలో బీజేపీ నేతల వ్యవహారశైలిపై కూడాపవన్ కల్యాణ్‌కు పార్టీ నేతల నుంచి నివేదికలు అందాయి. అధికార పార్టీపై ఎక్కడా పెద్దగా విమర్శలు చేస్తున్నట్లుగా లేదు. ప్రచారం కూడా పైపైన చేస్తూ.. ప్రెస్మీట్లు.. టీడీపీపై విమర్శలకే ప్రాధాన్యం ఇస్తూండటంతో వారి అజెండాపై పవన్‌కు అనుమానం ప్రారంభమైందని అంటున్నారు. మొత్తానికి కీలక సమయంలో క్వారంటైన్ పేరుతో పవన్ డుమ్మా కట్టడం… బీజేపీకి ఇబ్బందికరంగానే మారింది.