పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం చర్చలు జరుగుతున్నాయి. కథ కుదిరింది. బాలీవుడ్ సినిమా ‘పింక్’ ని రీమేక్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించే ఛాన్స్ వుంది. ఐతే ఈ రీమేక్ ఓకే చేయడం వెనుక చాలా కారణాలు వున్నాయి. పింక్ చూసిన జనాలకు పవన్ ఈ సినిమా ఓకే చేయడం ఏమిటనే సందేహం వస్తుంది. కారణం.. ఇందులో ఫైట్లు వుండవు. యాక్షన్ సీన్లు వుండవు. పవన్ పాత్ర స్క్రీన్ టైం కూడా తక్కువే. ఓ నలుగురు అమ్మాయిల చుట్టూ కథ తిరుగుతుంది. పవన్ ది ఓ లాయర్ పాత్ర. నాలుగు గదుల మధ్య కోర్టులోనే నడిచిపోతుంది.
మరి ఇలాంటి పాత్రకు పవన్ ఎందుకు ఓకే చెప్పారంటే… మొదటి కారణం రిస్క్ ఫ్రీ. ఆల్రెడీ పింక్ సినిమా హిట్. మినిమమ్ గ్యారెంటీ వుంటుంది. ఒకవేళ పొరపాటున తేడా కొట్టినా.. మెసేజ్ వున్న సినిమా కాబట్టి మంచి ప్రయత్నం అంటారు. మామూలు కమర్షియల్ సినిమా చేసి తేడా కొట్టించుకోవడం కంటే, ఇది చాలా బెటర్. అంతేకాదు… తక్కువ కాల్షీట్లతో పని జరిగిపోతుంది. మహా అయితే ఇరవై రోజుల్లో పవన్ పని పూర్తవుతుంది. ఇంకో కారణం కూడా వుంది. ఇప్పుడు యాక్షన్, డ్యాన్సులు చేయాలంటే మళ్ళీ ఫిట్ నెస్ సాధించాలి పవన్. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా దానికి కోసం కష్టపడే మూడ్ లో లేరు. ఇటు రాజకీయం అటు సినిమా.. ఈ రెండు కుదరాలంటే పింక్ లాంటి స్క్రిప్ట్ సరైన ఛాయిస్ భావించారట పవన్ కళ్యాణ్. ఆ రకంగా పింక్ తెరపైకి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యవిషయం.. ఈ సినిమా వెనుక మిత్రుడు త్రివిక్రమ్ హస్తం కూడా ఉంటుంది. ఆయన ఈ చిత్రానికి సంభాషణలు రాయడానికి ముందుకొచ్చారు. త్రివిక్రమ్ డైలాగులు.. ఈసినిమాకి బాగా ప్లస్సయ్యే ఛాన్సులున్నాయి. ఇవన్నీ చూసే పవన్ ఈ రీమేక్‌కి పచ్చ జెండా ఊపి ఉండొచ్చు.