ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానురానూ వేడెక్కుతున్నాయి. అప్రకటిత ఎన్నికల వాతావరణాన్ని తలిపించేలా అధికార, ప్రతిపక్షాలు కార్యచరణకు దిగుతున్నాయి. అక్టోబర్ నుంచి పాదయాత్ర చేస్తానంటూ జగన్ ప్రకటించేశారు. త్వరలోనే జిల్లాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంకల్పించారు. అయితే, ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏం చేస్తారనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జనసేన పార్టీని నిర్మించాలన్నది పవన్ ఆకాంక్ష. అందుకే, జిల్లాల వారీగా రాత పరీక్షలు పెట్టి, యువతను పార్టీలోకి తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన కూడా పోటీకి దిగుతుందని ఇదివరకే ప్రకటించారు. అయితే, సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేంత సాధనాసంపత్తి ఇప్పటి వరకూ జనసేనకు సమకూరలేదు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలూ పద్ధతులూ వ్యూహాలు కూడా ఆ దిశగా జనసేనను నడిపించలేవనేది అంగీకరించాల్సిన వాస్తవం! అయితే, రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై పవన్ దృష్టి సారించినట్టు జనసేన వర్గాలు అంటున్నాయి. త్వరలోనే పవన్ కల్యాణ్ కొత్త పంథాలో పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు.
తాను రాష్ట్రంలో పర్యటిస్తానని గతంలోనే పవన్ కల్యాణ్ ప్రకటించారు కదా. దానికి త్వరలోనే కార్యరూపం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే రాష్ట్రవ్యాప్త పర్యటనపై పవన్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకోవాలని పవన్ తరచూ అంటుంటారనీ, కాబట్టి పవన్ పాదయాత్ర ఉండే అవకాశం ఉందని వినిపిస్తోంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే… పవన్ పాదయాత్ర చేయాలంటే భారీ ఎత్తున బందోబస్తు కావాల్సి ఉంటుంది. పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, పవర్ స్టార్ గా ఆయనకి ప్రజల్లో భారీఎత్తున క్రేజ్ ఉంది. లక్షల సంఖ్యలో అభిమానులు తరలి వస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేసుకునే శక్తి జనసేనకు లేదనే చెప్పాలి. కానీ, ఎవరైనా వెనకుండి మద్దతు ఇస్తే పవన్ పాదయాత్ర భారీ ఎత్తున సాగే అవకాశాలు ఉంటాయి! అలా ఇచ్చేవారు కచ్చితంగా ఉంటారు కదా! ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర తరువాతే జనసేనాని జనంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి.
మరోపక్క.. పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం వైకాపా రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, పవన్ కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదని సమాచారం. వైకాపా నేతృత్వంలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారట. ఇదే క్రమంలో పవన్ ఆఫీస్ కు లెటర్ పంపారు. పవన్ ప్రస్తుతం అందుబాటులో లేరనీ, ఈ విషయాన్ని ఆయనకి తెలియజేస్తామని జనసేన కార్యాలయం ప్రశాంత్ కిషోర్ కు జవాబిచ్చినట్టు తెలుస్తోంది. అయితే, పవన్ ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతానని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకటి మాత్రం నిజం… పవన్ రంగంలోకి దిగితే, జగన్ పాదయాత్రకు మించి సక్సెస్ కావొచ్చు. పవన్ పాదయాత్రను ఆ రేంజిలో సక్సెస్ చేసేందుకు తెర వెనక శక్తులు సిద్ధం కావొచ్చు!