జనసేన అధినేత పవన్ కల్యాణ్… చేస్తున్న రాజకీయం చాలా మందికి విస్మయకరంగా ఉంది. ఊరూపేరూ .. కనీసం కార్యకర్తలు లేని పార్టీలకు… పెద్ద సంఖ్యలో సీట్లిచ్చి… ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారనేది.. చాలా మందికి అర్థం కావడం లేదు. నిజానికి కాస్త తరచి చూస్తే.. పవన్ కల్యాణ్ లక్ష్యం సుదీర్ఘ రాజకీయ ప్రణాళికలు ఇందులో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. పాతికేళ్లు రాజకీయం చేయడానికి వచ్చానంటున్న పవన్ కల్యాణ్… ఆ క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన అధికారం అందుకుంటాడని.. ఎవరూ అనుకోవడం లేదు . ఆయన కూడా అనుకోవడం లేదు. కానీ.. తన బలం భారీగా ఉందని చూపించుకోవాలనుకుంటున్నారు. అందులో భాగమే పొత్తులు.
దళితులు, కమ్యూనిస్టుల మద్దతుతో పవన్‌కు మరింత బలం..!
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ.. లెఫ్ట్ పార్టీలతోనే కలిసి వెళ్తానని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గత వారం అనూహ్యంగా లక్నోలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి.. కొత్త మైత్రికి నాందిపలికారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలను వదిలేసి.. లక్నో వెళ్లి మరీ.. పవన్ కల్యాణ్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం కాకలు తీరిన రాజకీయ నేతల్ని ఆశ్చర్య పరిచి ఉండవచ్చు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాతే.. పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో 20 శాతానికిపైగా దళిత ఓటర్లు ఉన్నారు. వారు ఎవరికి మద్దతిస్తే వారు కింగ్ మేకర్ కావడం ఖాయం. మాయావతి మద్దతు తీసుకోవడం ద్వారా.. దళిత ఓట్లను తనవైపు తిప్పుకొని కింగ్ మేకర్‌గా మారాలన్నది పవన్ వ్యూహం. అలాగే లెఫ్ట్ పార్టీలు బలహీనపడినా… వారికి కొంత స్థిరమైన ఓటు బ్యాంక్ ప్రతి నియోజకవర్గంలోనూ ఉంది. వారి ఓటింగ్ కూడా కలసి వస్తుంది.
సీట్లు ఎక్కువే ఇచ్చారు.. కానీ పొందే లాభం ఇంకా ఎక్కువ..!
బీఎస్పీకి 21 అసెంబ్లీ సీట్లతో పాటు తిరుపతి, చిత్తూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల సీట్లను కేటాయించారు. మరోవైపు వామపక్షాల నేతలతోనూ పవన్ కల్యాణ్ విస్తృతంగా చర్చలు జరిపారు. సీపీఐ, సీపీఎం నేతలు రకరకాల డిమాండ్లు వినిపించినా.. చివరికి ఆ రెండు పార్టీలకు ఒక్కొక్కరికి 7 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కలతో పాటు ఆయా పార్టీల సైజ్ చూస్తే… సీట్లు భారీగానే కేటాయించినట్లు అవుతుంది. కానీ.. ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుందనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ఓటు బ్యాంక్ సంఘటితం అయితే.. అంతిమంగా లాభపడేది.. జనసేన పార్టీనే.
పాతికేళ్ల రాజకీయం కోసం పక్కా ప్లాన్..!
ప్రస్తుతం జనసేనను.. ప్రజల్లో స్ట్రాంగ్‌గా నిలబెట్టాలనేది పవన్ వ్యూహం. ఈ ఎన్నికల్లో కనీసం పది నుంచి పదిహేను శాతం ఓటు బ్యాంక్ తెచ్చుకుంటే.. పార్టీకి భవిష్యత్ ఉన్నట్లే, గేమ్ చేంజర్ గా మారినట్లే. అయితే ప్రస్తుతం… టీడీపీ వర్సస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి పోలరైజ్ అవుతోంది. జనసేన ఒక్కటే బరిలో ఉంటే.. అసలు పరిగణనలోకి తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు దళితులు, కమ్యూనిస్టుల మద్దతుతో ఆయన ఓ ప్రభావవంతమైన శక్తిగా కనిపిస్తున్నారు. అందుకే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతోంది. జనసేన టీడీపీ బీ టీం అంటూ తెగ ప్రచతారం చేస్తోంది. ఈ ఆందోళనే.. పవన్ సాధించిన తొలి సక్సెస్ అనుకోవాలేమో..?