అల్లు అర్జున్ విషయంలో పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ మాట్లాడింది లేదు. ఆయన ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇన్నాళ్లకు ఈ ఇష్యూపై పవన్ కల్యాణ్ స్పందించినట్టు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు అతిథిగా ఆహ్వానించడానికి దిల్ రాజు పవన్ కల్యాణ్‌ని కలుసుకొన్నారు. ఈ సందర్భంగా బన్నీ అరెస్ట్ వ్యవహారం, రేవంత్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాలపై పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
రేవతి మరణం బాధ కలిగించిందని, ఈ విషయంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకొన్నారని పవన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రేవతి మరణించిన వెంటనే బన్నీగానీ, నిర్మాతలు కానీ రేవతి కుటుంబాన్ని కలిసి, పరామర్శించాల్సిందని, తామున్న మన్న భరోసా ఇచ్చి ఉంటే బాగుండేదని, ఆలస్యంగా స్పందించడం వల్ల పరిస్థితి చేజారిపోయిందని పవన్ అభిప్రాయపడినట్టు సమాచారం.
అల్లు అర్జున్ చేయి ఊపుతూ అభివాదం చేసుకొంటూ వెళ్లడం విమర్శలకు దారిచ్చింది. దీనిపై కూడా పవన్ మాట్లాడినట్టు టాక్. అలా చేయి ఊపుకొంటూ వెళ్లకపోతే.. హీరోపై తప్పుడు అభిప్రాయం అభిమానుల్లో కలుగుతుందని, అందుకే బన్నీ అలా చేసి ఉండొచ్చని, రేవతి మరణం బన్నీని కూడా బాగా కలచివేసి ఉండొచ్చని పవన్ చెప్పార్ట.
హీరోలు ధియేటర్లకు వెళ్లడం సరికాదని, చాలా ఏళ్ల క్రితమే తాను ధియేటర్లకు వెళ్లడం మానేశానని, చిరంజీవి కూడా ముఖాన ముసుగు వేసుకొని వెళ్లారని, ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారని తెలుస్తోంది.
పుష్ప 2 ఈవెంట్ లో బన్నీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతో పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. అందువల్లే రేవంత్ బన్నీపై కోపం పెంచుకొన్నారని, అరెస్ట్ చేయించారని అనుకొన్నారు. అయితే రేవంత్ ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోరని, ఆయన చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారని, పరిశ్రమని కూడా బాగా చూసుకొంటున్నారని, పుష్ప 2 రేట్లు పెంచుకోవడానికి ఆయన అనుమతులు ఇచ్చారని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. చట్టం ముందు అంతా సమానమే అని, ఆ సంకేతాల్ని రేవంత్ పంపారని పవన్ అభిప్రాయపడినట్టు టాక్. ఈ విషయంలో పోలీసుల తప్పు కూడా లేదని, బన్నీ కీ తన టీమ్ కీ మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరిగి ఉండొచ్చని పవన్ వ్యాఖ్యలు చేసినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.