మంది ఎక్కువ అయితే, మజ్జిగ పలచబడుతుంది. వంటగాళ్లెక్కువ అయితే…. వంట తగలడుతుంది. వేలు పెట్టేవాళ్లెక్కువ అయితే, సినిమా ఫలితం.. తార్ మార్ అవుతుంది. ప్రస్తుతం క్రిష్ – పవన్ సినిమాకి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితే ఎదురైందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.
పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి `హరి హర వీరమల్లు` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈవారంలోనే కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. అయితే.. ఈ సినిమా వ్యవహారంలో క్రిష్‌కి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయన్నది టాక్. తన సినిమాల విషయంలో పవన్ వైఖరి కాస్త భిన్నంగా ఉంటుంది. పట్టించుకుంటే.. ఓ లెవిల్లో పట్టించుకుంటాడు. లేదంటే పూర్తిగా దర్శకుడి అభిష్టానికి వదిలేస్తాడు. `వకీల్ సాబ్` సినిమాని అలానే దర్శకుడి టేస్ట్ కి వదిలేశాడు. అయితే.. క్రిష్ సినిమా విషయంలో తన జోక్యం మెల్లగా మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని తన ఆస్థాన రచయితల బృందంతో పవన్ రీ రైట్ చేయించాడని టాక్. అలానే.. నిర్మాత ఏ.ఎం.రత్నంకీ… రచన విభాగంలో అనుభవం, పట్టు ఉన్నాయి. ఆయన కూడా.. కొన్ని సన్నివేశాల్ని తరగ రాస్తున్నాడట. అలా ఎవరు పడితే వాళ్లు స్క్రిప్టు విషయంలో జోక్యం చేసుకోవడంతో.. క్రిష్ కాస్త గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. ఆలోచనలు పంచుకుంటే ఫర్వాలేదు గానీ.. `ఇదే తీయాలి` అని ఆర్డర్లు వేస్తే మాత్రం తన విజన్ బయటకు రాదన్నది క్రిష్ భయం. ఇలాంటి పరిస్థితుల్ని క్రిష్ ఇది వరకు ఎదుర్కోలేదు, ఎందుకంటే తాను స్టార్లతో పనిచేయలేదు. పవన్ లాంటి స్టార్ దొరకడంతో… ఎగిరి గంతేసిన క్రిష్‌కి.. స్టార్ ని ఎలా డీల్ చేయాలో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ గండం నుంచి క్రిష్ ఎలా గట్టెక్కుతాడో..?