తానా సమావేశాలకి హాజరైన పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ఎమోషనల్ స్పీచ్ కి హాజరైన సభికుల నుండి పెద్దఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అన్న వార్త కూడా రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగించింది. ఈ విషయాల మీద పవన్ కళ్యాణ్ స్పందన తీసుకోవడానికి టీవీ9 ప్రయత్నించింది. అదే ఆ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ కొన్ని సునిశితమైన చురకలు వేశారు. అదే సమయంలో మరి కొన్ని విషయాల మీద స్పష్టత ఇచ్చారు.
ఎన్నికల ఫలితాల మీద మీరు ఇప్పటిదాకా స్పందించకుండా ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడ తానా సభల వేదికగా స్పందించడానికి కారణం ఏంటి అని టీవీ 9 ప్రశ్నించినప్పుడు, తాను ఇది వరకే కూడా స్పందించానని, కానీ మీరు క్యాప్చర్ చేయలేనట్లున్నారు అంటూ సుతి మెత్తగా టీవీ9 కి చురకలంటించారు. దాదాపు ఎన్నికల ఏడాది అంతా పవన్ కళ్యాణ్ ని టీవీ9 బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా ఎన్నికల ఫలితాల మీద తనకు ఎటువంటి బాధ లేదని, కేవలం 15 నిమిషాల్లోనే ఆ బాధ నుండి బయటకు వచ్చానని పవన్ కళ్యాణ్ స్పీచ్ లో చెప్పిన సంగతిని ప్రస్తావిస్తూ, ఆ పదిహేను నిమిషాలు ఎలా ఫీల్ అయ్యారని ప్రశ్నించినప్పుడు, తాను తక్షణమే ఆ బాధ నుంచి బయటకు వచ్చారని, కానీ తనను నమ్ముకుని ఉన్న వారిని ఎలా ఓదార్చాలి వారికి ఎలా చెప్పాలి అన్న విషయం మీదే తన ఆలోచనలు ఆ పదిహేను నిమిషాలపాటు ఎక్కువగా సాగాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే ” మీరు మొదటి సారిగా ఒక రైతు బిడ్డ కు, ఒక సాఫ్ట్వేర్ నుండి వచ్చిన రైతుగా మారిన వారికి, ఇలా చాలామంది సామాన్యులకు మొదటిసారిగా టికెట్లు ఇచ్చారు కదా, వారు ఎన్నికల ఫలితాల అనంతరం ఎలా ఫీలయ్యారు, వారేమైనా ఫలితాల మీద డిప్రెషన్ కు గురయ్యారా” అంటూ టీవీ9 పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించింది. నిజానికి పవన్ కళ్యాణ్ ఎంతో మంది సామాన్యులకు టికెట్లు ఇచ్చి ఒక సత్సంప్రదాయం నెలకొల్పిన ప్పుడు, ఎన్నికలకు ముందు ఏ రోజు కూడా ఈ విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు టీవీ9. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్, వారు ఎవరు కూడా ఒక రోజులో అద్భుతాలు జరుగుతాయని కానీ, ఏదో ప్రత్యేక ప్రయోజనాలు ఆశించి కానీ పార్టీలో చేరలేదని, ఎన్నికల ఫలితాల అనంతరం రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా ప్రజల కోసం శ్రమిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక రామ్ మాధవ్ తో భేటీ గురించి పవన్ కళ్యాణ్ ని స్పష్టత కోరగా, పవన్ కళ్యాణ్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అసలు భేటీ జరిగింది అన్న విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ నిర్ధారణ చేయలేదు. ఎన్నిసార్లు రెట్టించి అడిగినప్పటికీ, మరో విధంగా సమాధానం ఇచ్చాడు తప్పించి, భేటీ గురించి కానీ భేటీలో చర్చించిన అంశాల గురించి గానీ బయటకు చెప్పలేదు. అయితే తాను ప్రత్యేక హోదా విషయంలోనే బిజెపితో విభేదించానని, ఇప్పటికి కూడా ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నానని, అయితే తెలంగాణ ప్రజలలో తెలంగాణ సాధన మీద అప్పట్లో ఉన్నంత గట్టి ఆకాంక్ష ఆంధ్ర ప్రజలలో ప్రత్యేక హోదా గురించి రావాల్సి ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలాగే రామ్ మాధవ్ ఆపరేషన్ ఆకర్ష్ కోసమే తానా మహాసభలకు వచ్చారా అని ప్రశ్నించగా, అసలు తాను ఆపరేషన్ ఆకర్ష్ అన్న దాన్ని నమ్మనని, ఎవరైనా పార్టీ సిద్ధాంతాలు నచ్చి, లేదా పార్టీ నచ్చి పార్టీ మారతారే తప్పించి, ఇలా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నాయకులను చేర్చుకోవడం మీద తనకు నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరవటం, అక్కడ అనూహ్యంగా రాజకీయ భేటీలు జరగడం, ఇది కొత్త సమీకరణలకు దారి తీస్తుంది అనే ప్రచారం జరగడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.