జనసేన అధినేత పవన్ కల్యాణ్… తన పార్టీకి ఓ స్టేచర్ ఉన్న నేతల కోసం.. ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు పాతకాలం నేతలొద్దని.. వారసులు అసలే వద్దని… తాను యువత నుంచి నేతల్ని తయారు చేసుకుంటానని గతంలో పవన్ ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం..సీనియర్ నేతలు ఎవరు ఖాళీగా ఉన్నారా… అని వెదుకుతున్నారు. తాజాగా… విశాఖ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇంటికి వస్తానంటే.. ఎలా వద్దంటాను అనుకున్న దాడి వీరభద్రరావు కూడా.. పవన్‌కు ఘనమైన ఆతిధ్యం ఇచ్చారు కానీ… పార్టీలో చేరే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అనుచరులతో మాట్లాడి చెబుతానన్నారు.
దాడి వీరభద్రరావుది.. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ రక్తం. కానీ.. 2014 ఎన్నికలకు ముందు.. హఠాత్తుగా వైసీపీలో చేరారు. ఎందుకు చేరారో ఎవరికీ తెలియలేదు. అరవై మూడేళ్ల వయసులో పాదయాత్ర చేస్తూ… చంద్రబాబు విశాఖకు వచ్చిన సమయంలోనే.. తన కుమారుడు రత్నాకర్‌ను తీసుకుని చంచల్ గూడ జైలుకెళ్లి జగన్‌తో ములాఖత్ అయ్యారు. బహుశా.. అప్పటికీ చంద్రబాబు గెలుస్తాడని.. నమ్మకం లేకపోయి ఉండవచ్చు. ఆ తర్వాత వైసీపీ తరపున “దాడి”కి పోటీ చేసే అవకాశం రాలేదు. ఆయన కుమారుడికి మాత్రం విశాఖ ఉత్తరం టిక్కెట్ ఇస్తే.. ఓడిపోయారు. ఎన్నికల తరవాత వైసీపీ అధినేతపై తీవ్ర ఆరోపణలు చేసి.. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటి వరకూ ఏ పార్టీలోనూ చేరలేదు.
ఒకే ఒక్క తప్పటడుగుతో.. దాడి వీరభద్రరావు.. తన రాజకీయ జీవితంలో చెరపలేని మరక వేసుకున్నారని… ఆయన టీడీపీకి రాజీనామా చేసినప్పుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదే నిజమైంది. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఓ అనామకునిగా మారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో తనకు మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రావాల్సి ఉందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆహ్వానిస్తే చేరిపోతానన్నారు. అదే సమయలో… టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడుతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో టీడీపీ ఈక్వేషన్లు కొంచెం తేడాగా ఉన్నాయి. టీడీపీలో ఎంట్రీ కోసం సబ్బరం హరి, కొణతాల రామకృష్ణతో పాటు..దాడి వీరభద్రరావు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ లెక్కలను చంద్రబాబు సరి చేసి.. అందర్నీ పార్టీలోకి తీసుకుంటారన్న అంచనాలున్నాయి.
అందుకే దాడి వీరభద్రరావు… పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చి ఆహ్వానించినా.. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఎంట్రీ లేకపోతే.. ఎలాగూ వైసీపీలోకి వెళ్లరు కాబట్టి.. కుమారుడి కోసమైనా…జనసేనలో వెళ్తారన్న ప్రచారం ఉంది. కానీ…దాడి ఫ్యామిలీని టీడీపీలోకి ఆహ్వానించే విషయంలో చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుందో మాత్రం అంచనా వేయలేం. దాన్ని బట్టే “దాడి” నిర్ణయం ఉండొచ్చు.