తమిళనాడు రాష్ట్రంలో తెలుగువాళ్ళు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాలలో చాలా ఏళ్లుగా ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్ళు నడుస్తున్నాయి. కారణాలు ఎవయితేనేమి తమిళనాడు ప్రభుత్వం వాటిని మూసివేయడమో లేక వాటిని తమిళ మీడియం స్కూళ్ళగా మార్చడమో చేయాలని భావిస్తోంది. సాధారణంగా తెలుగు మీడియం ప్రభుత్వ స్కూళ్ళలో నిరుపేదలే చదువుకొంటుంటారు. కనుక వాటిని మూసివేసినట్లయితే వారి పిల్లలకు తెలుగు బాష నేర్చుకొనే అవకాశం పోతుంది. కనుక వాటిని కొనసాగించాలని వారు కోరుతున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు బాషా ప్రేమికులు కూడా తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాటిని కొనసాగించవలసిందిగా కోరింది. కానీ తమిళనాడు ప్రభుత్వం వారి విజ్ఞప్తులను పట్టించుకొనే ఉద్దేశ్యంలో లేదు.
తాజా సమాచారం ప్రకారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు ఈ నెలాఖరున ధర్నా చేయాలనుకొంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన తమిళనాడులో కాకుండా తెలుగువాళ్ళు తన అభిమానులు ఎక్కువగా స్థిరపడిన బెంగళూరు సమీపంలో గల హోస్సూరు వద్ద ధర్నా చేయాలనుకొంటున్నట్లు సమాచారం. దానికోసం ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ ధర్నా చేయబోతున్న వార్త నిజమయితే అదేదో ఆయన తమిళనాడులోనే చేస్తే బాగుండేది కదా? అని తమిళనాడులో స్థిరపడిన తెలుగువాళ్ళు అనుకొంటే ఆశ్చర్యం లేదు. కానీ ఈ ధర్నా గురించి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తలను దృవీకరించలేదు కూడా. ఒకవేళ ఆయన నిజంగానే ధర్నా చేయదలిస్తే నేడో రేపో స్వయంగా దృవీకరించవలసి ఉంటుంది. లేకుంటే అటువంటి కార్యక్రమమేదీ లేనట్లే భావించవచ్చును.