జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ తరపున పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన మాజీ వైసీపీ నేత పితాని బాలకృష్ణను… పార్టీ తరపున బీఫాం అందుకునే తొలి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. అనుచరులతో కలిసి… హైదరాబాద్ వచ్చిన పితాని బాలకృష్ణకు… పవన్ కల్యాణ్ స్వీట్ షాక్ ఇచ్చారు. అనూహ్యంగా పవన్ కల్యాణ్ సీటు విషయాన్ని ప్రకటించడంతో… పితాని బాలకృష్ణ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్‌కు పాదనమస్కారాలు చేసుకున్నారు. ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్న ఆయన… చాలా రోజుల పాటు ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.
భారీగా ఖర్చు పెట్టుకున్న తర్వాత జగన్.. పితాని బాలకృష్ణను పదవి నుంచి తప్పించి వేరే వారికి అవకాశం ఇచ్చారు. జగన్ పేరు ప్రస్తావించకపోయినా.. తాను తీవ్రంగా వంచనకు గురైన సమయంలో.. పవన్ కల్యాణ్.. ఆదరించాడని.. కన్నీళ్లు పెట్టుకున్నారు. పితాని బాలకృష్ణ బలమైన వ్యక్తిని అని పవన్ అభినందించారు. కులాల మధ్య ఐక్యత కోసం తాను పోటీ పడతానన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న పితాని బాలకృష్ణ.. వైసీపీ అధినేత టిక్కెట్ ఇస్తాననడంతో 8సంవత్సరాలు సర్వీసు ఉన్నా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే జగన్ తీరు అర్థం కావడానికి ఆయనకు ఎక్కువ సమయం కాలం పట్టలేదు.
ఏపీలో తొలి అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. జనసేన వ్యవహారాలు పూర్తిగా ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో పొత్తుల వ్యవహారాలపై… చర్చించేందుకు పవన్ కల్యాణ్… లెఫ్ట్ నేతలతో సమావేశమయ్యే పనిలో ఉన్నారు. ఈ చర్చల ప్రక్రియ పూర్తయితే… ఆయన ఏపీలో మళ్లీ పోరాటయాత్ర ప్రారంభించే అవకాశాలున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.