తొలి విడత అభ్యర్థుల ప్రకటనకు జనసేన కూడా సై అంది. రిపబ్లిక్ డే రోజున జనసేన అభ్యర్థులను ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే అందరివీ కాదు. కొంత మంది అభ్యర్థుల్ని మాత్రం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో సమావేశమైనప్పుడు.. రిపబ్లిక్ డే రోజు కొంత మందితోనైనా తొలి జాబితా ప్రకటిస్తానని జనవరి నెలాఖరుకు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తానని స్పష్టం చేశారు. యువతరాన్ని ప్రోత్సహించాలన్నది జనసేన లక్ష్యమని, అభ్యర్థుల ఖరారు కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉంటుందని పార్టీ నేతలకు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై… చివరి వరకు తేలే అవకాశం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు … అభ్యర్థులను సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే.. సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా.. కసరత్తు పూర్తి చేసేశారని.. క్లిష్టంగా మారిన కొన్ని నియోజకవర్గాల్లో నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. అలాగే.. జగన్మోహన్ రెడ్డి కూడా..వైసీపీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారని.. ఆయన పాదయాత్ర ముగింపు రోజున… కొంత మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ జాబితాలో పవన్ కల్యాణ్ కూడా చేరారు. ఆ రెండు పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటిస్తే.. జనసేన వెనుకబడిందనే అభిప్రాయం రాకుండా.. ఆయన కూడా అభ్యర్థుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఏపీలో రాజకీయాలు.. ఫిబ్రవరి మొదటి వారం కల్లా.. ఫుల్ స్పీడ్ అందుకోనున్నాయి. దాదాపుగా అభ్యర్థులందరూ.. అన్ని పార్టీల తరపున అప్పటికే ఖరారవుతారు. ప్రచార జోరు కూడా పెరుగుతుంది. తెర వెనుక రాజకీయాలు కూడా ఊపందుకునే అవకాశం ఉంది.