ఎట్టకేలకు పార్టీలో నాయకుల్ని చేర్చుకోవడం ఆరంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన చేపట్టిన బస్సుయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు పూర్తికావొచ్చింది. ఆ మూడు జిల్లాల విషయమే తీసుకుంటే.. ఎంత కాదనుకున్నా పవన్ ను తమ సొంత నేతగా కాపు సామాజిక వర్గం చూసిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు పార్టీలోకి వచ్చి చేరతామంటున్నవారిలో కూడా ఎక్కువ మంది ఆ సామాజిక వర్గం నుంచే సంసిద్ధమౌతున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర తరువాత, కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఈ నేపథ్యంలో, కాపు నేతలపై జనసేనలో చేరాలనే ఒత్తిడి ఉంటుందా అనే చర్చ మొదలైంది. గతంలో, అంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో కూడా ఇలానే ఇతర పార్టీల్లో ఉంటున్న కాపు నేతలపై కూడా ఒత్తిడి పడింది..! తమ కులం పార్టీ ఇదే అనే అప్రకటిత భావన ఏర్పడింది. కొందరి వ్యక్తిగత నిర్ణయాలకంటే అభిమానుల ప్రోత్సాహం, కేడర్ ప్రోద్బలంతో ప్రజారాజ్యంలో చేరినవారూ ఉన్నారు. అప్పట్లో కొత్తపల్లి సుబ్బారాయుడు, గంటా శ్రీనివాసరావు వంటి నేతలు ఇతర పార్టీల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది..! ఒకరకమైన ఒత్తిడికిలోనై ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ కూడా వారికి మంచి స్థానమే లభించింది. కాకపోతే, ఆ తరువాత పరిస్థితులు మారిపోవడం, కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం… తదనంతర పరిణామాల నేపథ్యంలో కాపు నేతలు ఇతర పార్టీల వైపు వెళ్లాల్సి వచ్చిందీ.. ఇతర పార్టీల్లో కూడా వారికి సముచిత స్థానమే దక్కింది. కాకపోతే, చిరంజీవి రాకతో సామాజిక వర్గం పేరుతో ఒత్తిడిని కొంతమంది నేతలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇప్పుడు పవన్ రాక నేపథ్యంలో కూడా కొంతమంది కాపు నేతలపై ఇలాంటి ఒత్తిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. యువతలో ఒక సినీతారగా పవన్ కు అభిమానం బాగా ఉండటం, మరీ ముఖ్యంగా కులం పేరుతో ఎవరికివారు రాజకీయాలు చేసేందుకు సిద్ధమౌతున్న పరిస్థితి ఏపీలో ఎక్కువగా ఉండటంతో.. పవన్ పర్యటన కొంతమంది నేతలపై ఒత్తిడి కలిగిస్తోందనే అంటున్నారు! ఉభయ గోదావరి జిల్లాల నుంచి పవన్ పార్టీలోకి చేరికలు ఇలా కుల సమీకరణల నేపథ్యంలోనే ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల మత ప్రాంతాలకు అతీతంగా పార్టీ నిర్మిస్తానని పవన్ చెప్పినా కూడా… కాపు సామాజిక వర్గంలో ఈ తరహా సొంత భావన ఏర్పడుతుందోనేది వాస్తవం. అయితే, దీన్ని ఈ స్థాయిలోనే గుర్తించి, నష్ట నివారణ చర్యలు పవన్ ఇప్పుడే చేపట్టకపోతే… ఆ ముద్రను వదిలించుకోవడం అంత ఈజీగా కాదు. వదలించుకోకపోతే ఇతర సామాజిక వర్గాల అభిమానం పొందడమూ సులువు కాకుండాపోయే ప్రమాదం ఉంటుంది.