జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు. పోరాటయాత్ర కోసం… తూర్పుగోదావరి జిల్లా వెళ్లే క్రమంలో.. ఆయన రైలు ప్రయాణికులతో ములాఖత్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఓ పార్టీ కార్యక్రమంగా దీన్ని రూపొందించి.. విజయవాడ నుంచి తుని వరకూ రైల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఆ రైలుయాత్రను ఈ రోజే చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే జన్మభూమి ఎక్స్‌ప్రెస్… మధ్యాహ్నం ఒకటిన్నరకు విజయవాడ చేరుకుంటుంది. పవన్ కల్యాణ్ విజయవాడలో… ఆ రైలు ఎక్కుతారు. అక్కడి నుంచి తుని వరకూ… రైల్లో ప్రయాణిస్తారు. ఈ ప్రయాణంలో ప్రజా సమస్యలు, జనసేన పార్టీ ఆశయాలను ప్రయాణికులకు వివరిస్తారు.
పవన్ రైలు యాత్ర కు వచ్చే అభిమానులు, కార్యకర్తలకు జనసేన పార్టీ పలు సూచనలు చేసింది. విజయవాడ నుంచి తుని వరకూ వివిధ స్టేషన్లలో పవన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వాళ్లు విధిగా ఫ్లాట్‌ఫాం టిక్కెట్ తీసుకుని వాటినే బ్యాడ్జిలుగా ధరించి రావాలని సూచించారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో పాటు రైలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దని ఫ్యాన్స్‌ను కోరింది. పవన్ ప్రయాణికులతో మమేకయ్యేలా వీలు కల్పించాలని జనసేన పవన్ అభిమానులను కోరింది. అయితే పవన్ కల్యాణ్. జనసేన ఎన్ని సుద్దులు చెప్పినా.. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కాబట్టి… వాళ్ల రూల్స్ వాళ్లు అమలు చేస్తారు. నిజానికి రైల్వే స్టేషన్లు.. రైళ్లలో రాజకీయ కార్యక్రమాలు పెట్టుకున్న వారు ఎవరూ లేరు. ఏమైనా ఉంటే.. ప్రత్యేక రైళ్లను మాట్లాడుకుని.. చలో ఢిల్లీ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు కానీ… రైల్లో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుటాననన్న నేత ఎవరూ లేరు. ఈ కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నప్పటికీ… పవన్ కల్యాణ్ లాంటి సినీ హీరో… కమ్ పొలిటిషియన్ చేపట్టాల్సిన యాత్ర కాదన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది.
ఎందుకంటే.. పవన్ ను చూసేందుకైనా… పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రైలు ఎక్కుతారు. మామూలుగా.. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇలాంటి రైళ్లలో పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర పెట్టుకుంటే.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడానికే అవకాశం ఉంటుంది. ఏమైనా జరిగితే… అది పవన్ కల్యాణ్ ఇమేజ్‌కే ఇబ్బందికరం అవుతుంది. రైళ్లతో వ్యవహారం కాబట్టి.. ఏపీ ప్రభుత్వాన్ని నిందించడానికి అవకాశం ఉండదు. రైల్వే శాఖను కూడా.. ఏమీ అనలేని పరిస్థితి. ఇదంతా తెలిసి కూడా.. పవన్ కల్యాణ్‌కు రైలు యాత్ర.. ఆలోచన ఎవరు చెప్పారో మరి..!