టాలీవుడ్లో పారితోషికం విషయంలో టాప్ 1లో ఉండే కథానాయకుడు పవన్ కల్యాణ్. మహేష్ బాబు కూడా పవన్‌కి గట్టి పోటీ ఇస్తుంటాడు. కాకపోతే.. ఆ స్థానం మాత్రం పవన్ కల్యాణ్‌దే. తాజాగా కాటమరాయుడు సినిమా కోసం పవన్ అందుకొన్న పారితోషికం ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. ఈసినిమా కోసం పవన్ అక్షరాలా రూ.28 కోట్లు అందుకొన్నాడన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా చూస్తే పవన్ ఈ సినిమాకి ఒకానొక నిర్మాత. తనకు లాభాల్లో వాటా దక్కడం సహజం. అయితే.. పవన్ ఇలాంటి విషయాల్లో చాలా తెలివిగా ఆలోచిస్తాడని, సినిమా విడుదలకు ముందే.. సేఫ్ జోన్లో ఉండడానికి ప్రయత్నిస్తాడని తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్‌కీ ఇలానే చేశాడు. సినిమా విడుదలకు ముందే వచ్చిన లాభాల్లో తన వాటాగా రూ.25 కోట్ల వరకూ తీసుకొన్నాడు. ఈసారి పవన్ తన పారితోషికంగా నైజాం, సీడెడ్ రైట్స్‌ని అట్టి పెట్టుకొన్నాడని తెలుస్తోంది.
కాటమరాయుడు సినిమా నైజాంలో రూ.18 కోట్ల వరకూ పలికింది. సీడెడ్ లో రూ.10 కోట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే పవన్ పారితోషికం రూ.28 కోట్లకు పైమాటే. అయితే ఈ పారితోషికాన్ని పవన్ దశల వారీగా తీసుకొంటాడని, శరత్ మరార్తో తనకున్న అనుబంధం దృష్ట్యా మూడు విడతలుగా అందుకొన్నాడని తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్‌తో నష్టపోయిన బయ్యర్ల కోసం ఈ సినిమాని తీశామని చెప్పుకొంటున్నా… సర్దార్ బయ్యర్లెవరూ కాటమరాయుడు లిస్టులో కనిపించడం లేదు. ఈ విషయంలో సర్దార్ని కొనుక్కొన్న పంపిణీదారులు మీడియా ముందు వచ్చి తమ గోడు వెళ్లదీసుకొన్నారు. అయినా సరే… ఎలాంటి సాయం అందలేదు. ఈసినిమా ద్వారా వచ్చిన లాభాల్లో కొంత నష్టపరిహారంగా తిరిగి ఇచ్చే అవకాశాలున్నాయని, అందుకే పవన్ ఏం మాట్లాడడం లేదని తెలుస్తోంది. దాంతో సర్దార్ తో నష్టపోయిన బయ్యర్లు కూడా కామ్ అయ్యారట.