గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ ఎట్ హోం కార్యక్రమంలో అనేక మంది రాజకీయ నాయకులు పాల్గొన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ తో కెసిఆర్ కెటిఆర్ మాట్లాడుతున్న దృశ్యాలు అన్ని చానళ్ల కెమెరాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి.
ఈ కార్యక్రమానికి వైయస్ జగన్ హాజరు కాలేదు కానీ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పితాని, ఇతర పార్టీల నుంచి జానారెడ్డి, భట్టి విక్రమార్క, లక్ష్మణ్ లాంటి ఎంతో మంది నాయకులు హాజరైనప్పటికీ, అన్ని కెమెరాల కళ్లన్నీ పవన్ కళ్యాణ్ కేసీఆర్ భేటీ మీద, పవన్ కళ్యాణ్ కేటీఆర్ ల ముచ్చట్ల మీద కేంద్రీకృతం అయ్యాయి. కెసిఆర్ పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని దాదాపు పది నిమిషాలు చర్చించారు. ఆ తర్వాత కెసిఆర్ ఇతర నాయకులని పలకరించడానికి వెళ్లగా, కెటిఆర్, పవన్ కళ్యాణ్ మరో పావుగంట సేపు ముచ్చటిస్తూ కనిపించారు. ఈ చర్చ లు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఆ మధ్య కేసీఆర్, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడతానని ప్రకటించడం, కేటీఆర్ జగన్‌ల మధ్య ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చలు జరిగి ఉండడం, అలాగే జనసేన తో పొత్తు కుదుర్చుకోవడానికి వైయస్సార్సీపి టిఆర్ఎస్ పార్టీ ద్వారా ఒత్తిడి చేస్తోందని పవన్ ప్రకటించి ఉండడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వే. అదీ కాక కొద్దిరోజుల కిందట జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రముఖ టిఆర్ఎస్ నాయకుడు ఒకరు జగన్ తో జనసేన పొత్తు పెట్టుకుంటే మీ పార్టీకి పొత్తు లో భాగంగా 60 సీట్లు ఇప్పిస్తామని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ జగన్ తో పొత్తు ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారని ప్రకటించారు.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన చర్చలు ఏమై ఉంటాయి అన్న ఆసక్తి అటు రాజకీయ వర్గాల్లో నే కాకుండా ఇటు ప్రజల్లో కూడా ఉంది. అయితే అక్కడ నిజంగా ఏం జరిగిందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు.