ముందు పింక్ రీమేకా? క్రిష్‌తో సినిమానా? ఈ సందిగ్థానికి తెర పడింది. పవన్ ముందుగా క్రిష్ సినిమానే ఎంచుకున్నాడు. పవన్ కల్యాణ్‌కి క్రిష్ ఇటీవల ఓ కథ చెప్పారని, అది జానపద చిత్రమని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు ఆ సినిమానే పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన డేట్లు కూడా పవన్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. నవంబరు 15 న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. `పింక్` రీమేక్‌కి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సినిమాకి పవన్ కేటాయించే కాల్షీట్లు 20 మాత్రమే అని సమాచారం. క్రిష్ సినిమా చేస్తూ… మధ్యమధ్యలో `పింక్` రీమేక్ కూడా పూర్తి చేసే అవకాశాలున్నాయి. కాకపోతే.. ఈ రెండు సినిమాల గెటప్పులు వేరు. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి. మరోవైపు క్రిష్ స్క్రిప్టు ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో తలమునకలై ఉన్నారు. క్రిష్ దగ్గర బౌండెడ్ స్ర్కిప్టులు కొన్నున్నాయి. అందులో ఈ కథ ఒకటి. కాకపోతే ఇప్పుడు పవన్ కల్యాణ్ శైలికీ, ప్రస్తుత పరిస్థితులకూ తగినట్టుగా మలచుకోవాలి. క్రిష్ అదే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.