జనసేన అధినేత పవన్ కళ్యాణ్… రాజధానికి మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు. విజయవాడలో ఆయన కవాతు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తేదీని కూడా ఖరారు చేసుకున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా.. ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో.. ఈ విషయంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఓ అంచనాకు వచ్చారు. అమరావతి విషయంలో.. రాష్ట్ర ప్రజంలదరిలోనూ ఓ ఎమోషన్ వచ్చిందని.. కవాతు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని పవన్ కల్యాణ్‌కు పార్టీ నేతలు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత.. కార్యాచరణ ప్రకటిస్తే.. ఏమీ చేయలేమని… నిర్ణయం తీసుకోవడానికి ముందే.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉంటుందన్న అభిప్రాయం..జనసేనలో ఉంది.
పవన్ కళ్యాణ్.. మొదటి నుంచి అమరావతికి మద్దతుగానే ఉన్నారు. పాలనా వికేంద్రీకరణను ఆయన వ్యతిరేకిస్తున్నారు. తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. రాజధాని గ్రామాలకు వెళ్లి మద్దతు ప్రకటించి వచ్చారు. పోలీసుల ఆంక్షలను ఎదుర్గొన్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో.. పవన్ పోరాటంపై ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది. అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ తర్వాత కార్యాచరణ ఏమిటన్నదానిపై వరుసగా చర్చలు జరుగుతున్నాయి. దానికి పవన్ కల్యాణ్ ఇప్పుడు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో నిర్వహించనున్న కవాతు కోసం భారీ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.
అన్ని రాజకీయ పార్టీలు.. సభలు, సమావేశాలు నిర్వహిస్తాయి. పవన్ కల్యాణ్ కాస్త భిన్నంగా.. తన పార్టీ కార్యకర్తలు, అనుచరులు.. ప్రజలతో.. ఓ సిటీలో.. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కవాతు నిర్వహించి.. ఆ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇది కొత్తదనంతో నిండి ఉంది. పవన్ వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. విశాఖలో ఇసుక సమస్యపై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన కవాతు భారీ సక్సెస్ అయింది. ఇప్పుడు.. అమరావతి విషయంలోనూ పవన్ అలాంటి కవాతునే ప్లాన్ చేస్తున్నారు.