ప్రత్యేక హోదా.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే స్థితిని రాజకీయ పార్టీలే కల్పించాయి. దీన్ని కేవలం ఒక రాజకీయ అంశంగా మార్చేశాయి. ఆంధ్రాలో అన్ని రాజకీయ పార్టీలూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామనే అంటాయి. అధికార పార్టీ తెలుగుదేశంతో సహా అందరి మాటా ఇదే. కానీ, ఎవరి పోరాటం వారిదే! స్పెషల్ స్టేటస్ సాధన కోసం అందరూ కలిసి పోరాడాలంటూ విడివిడిగా వ్యాఖ్యానించేవారే. కానీ, కలిసే సమయం రాదు, ఆ వేదికా కనిపించదు! వైకాపా, కాంగ్రెస్, జనసేన… అందరూ ప్రత్యేక హోదాల గురించి పోరాటాలు చేసి అలసిపోతున్నవారే! మిగతా పార్టీలన్నీ ఈ పోరాటంలో అలసి సొలసి కాస్త విరామం తీసుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. గుంటూరులో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాంగ్రెస్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆయన వస్తారని కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఆహ్వానంపై పవన్ కల్యాణ్ స్పందించడం విశేషం!
ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడే రాజకీయ పార్టీలకు తన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సభ సందర్భంగా ఆంధ్రా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి పవన్ అభినందనలు తెలిపారు. ఈ సభకు తనకు ఆహ్వానం అందిందనీ, అయితే కాస్త ముందుగా తెలిసి ఉంటే ప్లాన్ చేసుకునే వాడిననీ, సమయాభావం వల్ల రాలేకపోతున్నానని పవన్ చెప్పారు. కేంద్రం ఇచ్చిన హామీని సాధించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని కోరారు. కాంగ్రెస్ బహిరంగ సభ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్ని పార్టీలూ ఒకే వేదికపైకి రావాలని పవన్ ఆకాంక్షించడం బాగానే ఉంది. కానీ, హోదా సాధన దిశగా జనసేన చేస్తున్న పోరాటం ఏ స్థాయిలో ఉందనేది పవన్ చెక్ చేసుకోవాలి. అప్పుడెప్పుడో విశాఖలో యువత ఉద్యమిస్తుంటే మద్దతు పలికారు. అది కూడా కేవలం ట్వీట్ల ద్వారానే అనుకోండి. ఆ తరువాత, ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం మానేశారు! ఇప్పుడేమో, ఇలాంటి సభల ద్వారానే హోదా సాధన సాధ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ విషయం పవన్ కు తెలిసినప్పుడు… హోదా వాదనను ట్వీట్లకే ఎందుకు పరిమితం చేస్తున్నట్టు..? పవన్ కల్యాణ్ సభలేవీ..? తూతూ మంత్రంగా ఓ కాకినాడ, ఓ అనంతపురం లాంటి సభలతో పవన్ ఎందుకు ఆగిపోయారు..?
అన్ని రాజకీయాల పార్టీలూ ఒకే వేదిక మీదకు రావాలని కోరుకుంటున్నారు కదా. అందివచ్చిన ఇలాంటి సందర్భాలను ఎందుకు వదిలేస్తున్నారు..? ఇవాల్టి సభకు పవన్ హాజరై ఉంటే… ఇతర పార్టీలు కూడా స్పందించాల్సిన అనివార్యతను సృష్టించినట్టు అవుతుంది కదా! హోదా కోసం పోరాడేవారికి మద్దతు పలుకుతామని చెబుతున్న వైకాపా కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చేది. ఇదే సభకు పవన్ వస్తే టీడీపీకీ.. ఇంకా చెప్పాలంటే భాజపాకి కూడా కాస్త టెన్షన్ మొదలయ్యేది. అప్పుడు మరోసారి ప్రత్యేక హోదా హాట్ టాపిక్ అయ్యేది. కలిసి పోరాడాలన్న జనసేనాని ఆకాంక్ష బాగానే ఉంటోందిగానీ, ఆచరణలో ఉండటం లేదనే అభిప్రాయం మరోసారి ప్రజల్లోకి వెళ్తున్న సందర్భం ఇది.