పిఠాపురంలో పవన్ కల్యాణ్ అందర్నీ కలుపుకుని వెళ్తున్నారు. ఇతర జనసేన క్యాడర్ అత్యుత్సాహంతో ఏం చేసినా.. తన సోదరుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. పవన్ కల్యాణ్ మాత్రం అలాంటి సమస్యలు రానివ్వడం లేదు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం ఆయన పిఠాపురం వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ ఇంచార్జ్ వర్మనూ ఆహ్వానించారు. పార్టీ పరమైన కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించలేరు కానీ..అధికారిక కార్యక్రమాల్లో మాత్రం ఖచ్చితంగా ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అయితే కొన్ని వీడియోలలో ఆయనను ఎస్పీ ఆపేశారన్న ప్రచారం జరిగింది. నిజానికి ఆయనను. వెళ్లమన్నారు. ఆయన అనుచరులతోనే వెళ్తానన్నారు. అది కూడా ప్రోటోకాల్ సమస్య. ఎస్పీ వైసీపీ మాయలోనే ఉన్నాడని వర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో పవన్ కల్యాణ్ వైపు నుంచి కానీ జనసేన వైపు నుంచి కూడా ఎలాంటి తప్పిదం లేదు. వర్మ కూడా పవన్ కల్యాణ్ విషయంలో వేరే అభిప్రాయంతో లేరు. ఇతర వ్యక్తులు రెచ్చగొట్టాలని ప్రయత్నించినప్పుడు కూడా ఆయన సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు.
వర్మకు పదవి రాకుండా పవన్ అడ్డుకుంటున్నారన్న ఓ ప్రచారాన్ని కొంత మంది చేస్తున్నారు. ఇదంతా వైసీపీ నేతల ప్రచారమే. టీడీపీ అధినేత పదవి ఇవ్వాలనుకుంటే పవన్ కల్యాణ్ ఆపలేరు. పదవులు కేటాయించడానికి కొన్ని సమీకరణాలు ఉంటాయి. ఖచ్చితంగా అవి కుదిరిన రోజున వర్మకు పదవి వస్తుంది. పిఠాపురంలో సమస్యలు సృష్టించాలని.. వర్మ మద్దతు.. ఆయన అనుచరుల మద్దతు జనసేనకు లేకుండా చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారు. దాన్ని పవన్ నిర్వీర్యం చేస్తున్నారు.