పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బలంగా ఉందనుకున్న చోట పార్టీ వ్యవహారాలను గాడిన పెట్టడానికి ప్రత్యేకంగా కమిటీల్ని నియమించారు. సంస్థాగత నిర్మాణాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. అనుబంధ కమిటీలనూ ప్రకటించారు. ఇప్పుడు పార్టీలో క్రియాశీలక సభ్యులను పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 21 నుండి జనసే క్రియాశీలక సభ్యత్వాల మలివిడతను ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు.
జనసేన పార్టీ క్రమంగా బలపడుతోందని ప్రతి నియోజకవర్గంలో 2వేలమంది క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసేందుకు జనసైనికులు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ మధ్య రోడ్లకు శ్రమదానం చేశారు. పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. కాస్త మైలేజీ వచ్చినప్పటికీ దాన్ని నిలబెట్టుకునేలా కార్యకలాపాల్ని నిర్వహించలేకపోయారు.
అయితే పూర్తి స్థాయిలో క్యాడర్ ను సిద్ధం చేసి.. సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత రంగంలోకి దిగాలని పవన్ అనుకుంటున్నట్లుగా కనిపిస్ోతంది. ఈ మేరకు ఆయన క్రియాశీలక సభ్యత్వం పూర్తి చేసిన తరవాత రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.