ప్రజా జీవితంలోకి వచ్చాక ఏ విమర్శనైనా స్వీకరించవలసిందేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు గనక ఆయన తాజా కామెంట్స్‌ను విమర్శనాత్మకంగా చూడటం మంచిది. ఎంతగా ప్రచారం చేసుకున్నా సర్దార్ గబ్బర్‌సింగ్ ఆయన గత ఇమేజికి దరిదాపుల్లోకి రాలేకపోయినట్టు స్పష్టమవుతూనే వుంది. అత్తారింటికి దారేది సినిమాని పక్కనపెడితే కనీసం గత గబ్బర్ సింగ్‌లో వున్న పాటి బిగువు కూడా దీనికి లేదని తేలిపోయింది. వసూళ్లలోనూ మందగమనం కనిపిస్తున్నది. అభిమానుల చలవ వల్ల చివరకి ఎలాగో గట్టెక్కవచ్చునేమో చూడాలి.
మామూలుగా మీడియాతో పరిమితంగా మాట్లాడుతూ అనుకున్నవే చెప్పే పవన్ కళ్యాణ్ ఈ సమయంలో చాలా మీడియా సంస్థలతో చాలా వివరంగా మాట్లాడ్డంలో ఆంతర్యం తను కష్టపడితీసిన సినిమాను పడిపోకుండా నిలబెట్టుకోవడం మొదటిదని ఎవరికైనా తెలిసిపోతుంది. అయితే ఆ సమయంలో ఆయన మాట్లాడిన దానిలో సినిమాతో సమానంగా కాదంటే ఒక్క పిసరు ఎక్కువగా రాజకీయ సామాజిక అంశాలు ప్రస్తావించడం ఆకర్షణ పెరగడానికి దోహదం చేస్తుందని భావించివుండొచ్చు.
అభిమానుల కోసం తప్ప అద్బుతం ఏమీ లేదని స్పష్టమైనాక ఆ చిత్రం గురించి అతిగా మాట్లాడ్డానికి అవకాశం లేదు.అదే అత్తారింటికి దారేదీ సమయంలో ఒక స్పాన్సర్డ్ ఇంటర్వ్యూ నే అన్ని ఛానళ్లలోనూ పదేపదే ప్రసారం చేశారు. అప్పుడూ ఇప్పుడు కూడా పవన్ కాస్త మాడెస్ట్గానే మాట్లాడారని ఒప్పుకోవాలి. కాని ఈసారి రాజకీయాల పాలు పెంచడం, కులాల గురించి కూడా ప్రస్తావించడం, కెసిఆర్‌పై ప్రశంసలు ఇవన్నీ యథాలాపంగా జరిగినవని చెప్పడానికి లేదు. ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా సినిమాను ప్రమోట్ చేసుకోవడంతో పాటు రాజకీయంగానూ తన స్లాటు అట్టిపెట్టుకోవడానికి ఈ సందర్భాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. అది ఆయన హక్కు.
ప్రజలకు ఆసక్తి గనక తప్పని చెప్పడానికి లేదు. అయితే ఈ సందర్భంగా వెలిబుచ్చిన భావాలు మాత్రం ఆయన చే గువేరా స్టయిల్‌కు అనుగుణంగా లేవని మరోసారి బయిటపెట్టుకున్నారు. బహుశా అందుకే నెమ్మదిగా చే ఫోటో తగ్గించేస్తున్నారు. బిజెపిని బలపర్చడం నరేంద్ర మోడీని కీర్తించడం, చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తానంటూనే ప్రశంసల దగ్గర ఆగిపోవడం ఇవన్నీ పవన్ పవర్‌ను తగ్గించేశాయి. మిగతావన్నీ ఎలా వున్నా కనీసం హెచ్‌సియు విషయంలోనైనా సామాజిక న్యాయానికి మద్దతుగా గట్టిగా గళం వినిపించలేకపోవడం పెద్ద లోపం.
భారత మాతకు జై కొట్టాలనే షరతులోనూ ఆయన బిజెపితోనే నిలబడ్డారు. ఇవన్నీ చూస్తుంటే పవర్ స్టార్ అటువైపే మొగ్గుతారని అనుకోవలసి వస్తుంది. ప్రత్యేక హౌదా విషయంలోనూ సగం సమయం గడిచిపోయినా ఇంకా ఆశ వుందనడం హీరోచితంగా లేదు.
పవన్ కళ్యాణ్ బిజెపిలో చేరతారని, చిరంజీవి కూడా వెళ్లవచ్చని చాలా ప్రచారమే జరిగింది. అప్పట్లోనే నేను 360లో ఆ అవకాశం లేదని స్పష్టంగా రాశాను. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ దానిపై క్లారిటీ ఇచ్చేశారు. చెరో శిబిరంలో వుంటే మంచిదన్న అవగాహన కూడా ఆ ఇంటలిజెంట్ ఫ్యామిలీ మెంబర్స్‌కు మొదటి నుంచి వుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన బ్యానర్ కొనసాగిస్తూ తమతో చేతులు కలిపితే ఎ క్కువ ఉపయోగమని బిజెపి భావిస్తున్నది. ఎన్నికలు 2019లో గాని రావు గనక ఆ లోపల రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు రాజకీయ వ్యవహారాలునడిపే ఆసక్తి శక్తి కూడా జనసేనకు లేవు. సరిగ్గా అప్పుడే క్లాప్ కొడితే ప్రొడక్షన్ నెం 2 లా మరో ఎన్నికల రోల్‌కు సిద్దం కావచ్చనే అంచనాతోనే పవర్ స్టార్ టీజర్ విడుదల చేశారు.
డబ్బులు బొత్తిగా లేవంటున్నారు గాని రాజకీయంగా ఉపయోగపడే అలాటి శక్తులకు అవసరమైన వనరులు సమకూర్చడానికి బిజెపి నాయకత్వం సిద్ధంగానే వుంటుంది. నిజానికి ఆ ఉభయుల మధ్య అవగాహనకూడా అదేనన్నది అంతర్గత సమాచారం.