2019 ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లో దిగబోతున్నాడు పవన్ కల్యాణ్. ఇప్పుడంటే.. అప్పుడప్పుడూ ట్విట్టర్ ద్వారా టచ్‌లోకి వస్తున్నాడు గానీ – పవన్ జనాలమధ్యకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. పవన్ కూడా అందుకు తగిన సన్నాహాల్లోనే ఉన్నట్టు వినికిడి. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే.. పవన్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నాడని టాక్. పార్టీ వ్యవస్థీకరణ, ప్రచారం, ప్రజా సమస్యలు, మానిఫెస్టో… ఈ విషయాలపై పవన్ దృష్టి పెట్టబోతున్నట్టు టాక్. అవసరమైతే ఎన్నికలు పూర్తయ్యే వరకూ మరో సినిమా కూడా చేయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాడట.
2018 జనవరిలో… పవన్ – త్రివిక్రమ్ సినిమా విడుదల అవ్వబోతోంది. పవన్ అనుకొంటే.. ఎన్నికల లోపు మరో సినిమా చేసేయొచ్చు. కానీ పవన్ మాత్రం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నాడట. ‘సినిమాలు చేయాలని రూలేం లేదు.. సినిమాలకు గుడ్ బై చెప్పాలని వుంది’ అని పవన్ తరచూ.. అభిమానులతో చెబుతూనే ఉంటాడు. కాకపోతే.. గుడ్‌బాయ్ చెప్పడం కంటే.. అప్పుడప్పుడూ సినిమాలు చేసుకొంటూ – ప్రజా సేవలో తలమునకలవ్వాలన్నది పవన్ ఉద్దేశం. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాక.. పవన్ మూడ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కాకపోతే.. ఎన్నికల వరకూ సినిమాలు చేసే ఉద్దేశం అయితే పవన్‌కి లేనట్టే సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పవన్ కావాలంటే దర్శకులు ఇంకొంత కాలం ఆగాల్సిందే అన్నమాట.