భారతీయ జనతా పార్టీ ఏదో చేస్తుందని రాష్ట్రాన్ని కాపాడుతుందనే నమ్మకాన్ని పవన్ కల్యాణ్ కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. గతంలో రాష్ట్రంలో సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే మోదీ, అమిత్ షాలతో సమావేశం అవుతామని చెప్పేవారు. కానీ ఈ సారి మాత్రం తాము ఢిల్లీకి పోనే పోమని.. ఎవరినీ ఆశ్రయించబోమని.. రాష్ట్రంలోనే తేల్చుకుంటామని ప్రకటించారు. పవన్ ప్రకటన చాలా మందిని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే బీజేపీ వ్యవహారశైలి అంతే ఉంది.
ఎప్పుడూ పవన్‌ను గౌరవించని ఢిల్లీ బీజేపీ నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. కానీ ఆ పార్టీకి జనసేన కంటే వైసీపీనే దగ్గర. బీజేపీలో ఓ వర్గం నేతలు పూర్తి స్థాయిలో వైసీపీకి మద్దతుగా ఉంటూంటారు. ఇప్పటికీ అంతే. నిన్నటికి నిన్న జీవీఎల్ నరసింహరావు పవన్ కల్యాణ్‌ను విశాఖలో ఆపడాన్ని చంద్రబాబు హయాంలో జగన్‌ను విశాఖ ఎయిర్ పోర్టులో ఆపడాన్ని పోల్చుతూ ట్వీట్ చేశారు. జగన్ ఏదైనా తప్పు చేస్తే … వెంటనే చంద్రబాబు కూడా అలాగే చేశారని గుర్తు చేసేలా వాదించేందుకు కొంత మంది తెరపైకి వస్తారు. అదే సమయంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కూడా పవన్ లేవనెత్తుతున్న అంశాలను సీరియస్‌గా తీసుకోవడం లేదు.
ఇక వారి దగ్గరకు వెళ్లకూడదని.. అవమానపడకూడదన్న ఉద్దేశంలో పవన్
కలసి పోరాటం చేద్దామని పొత్తులు పెట్టుకున్న బీజేపీ తర్వాత ఎప్పుడూ కలిసి రాలేదు. అవకాశం వచ్చిన ఉపఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోంది. జనసేనకూ చాన్సివ్వలేదు. అంతే కాదు అసలు పవన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా మోదీ, అమిత్ షా ఆసక్తి చూపడం లేదు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో బీజేపీ పోటీ చేసేలా ఒప్పించడానికి ఓ సారి నడ్డా అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ ఇంత వరకూ మరోసారి జనసేన పెద్దలకు అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో పవన్ కూడా వారి చుట్టూ తిరేగేదేమిటని సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఢిల్లీకి వెళ్లే ప్రశ్నే లేదంటున్నారు.
జనసేన విలీనం కోసం కనిపించని ఒత్తిడి తెస్తున్న బీజేపీ
మిత్రపక్షాలను నిర్వీర్యం చేసి.. తమ పార్టీని బలోపేతం చేసుకోవడంలో బీజేపీది అందే వేసిన చేయి… ఏపీలో పవన్ ను నిర్వీర్యం చేస్తే .. ఆ ఓటు బ్యాంక్ అంతా తమకు వస్తుందని బీజేపీ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే జనసేనను విలీనం చేయాలని పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. చాలా ఘటనలు అదే నిజమని నిరూపించాయి. ఈ విషయంపై పవన్‌కు ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుందేమో కానీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.