శ్రీ రెడ్డి వివాదం కొత్త మలుపు తిరిగింది. శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని బూతులు తిట్టడంతో మలుపు తిరిగిన వివాదం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్లతో మరో కొత్త మలుపు తిరిగింది. టీవీ9 అధిపతి శ్రీనిరాజు, టీవీ9 సీఈవో రవి ప్రకాష్ ,దర్శకుడు రాంగోపాల్ వర్మ, లోకేష్ స్నేహితుడు రాజేష్, లోకేష్ కలిసి 10 కోట్ల డబ్బు వెచ్చించి ఈ కుట్ర పన్నారన్నారు పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళితే
దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, భర్త, పిల్లలు, తప్ప ఇంకో ప్రపంచం తెలియని మహిళ అయిన నా కన్న తల్లిని వినకూడని ఏ కొడుకు వినకూడని తప్పుడు పదం తో తిట్టమని సలహా ఇచ్చి, దాన్ని పదేపదే ప్రసారం చేసి డిబేట్ పెట్టిన ఈ టీవీ ఛానళ్ళు ఇలాంటి పనులు, ఇలాంటి డిబేట్లు చంద్రబాబు మీద, లోకేష్ మీద కాని, జగన్ మీద కాని, బాలకృష్ణ మీద కాని పెట్టగలరా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు కానీ ఇప్పుడు దొరలంటే మీడియా ఆసాములు వారు చెప్పిందే వేదం పాడిందే నాదం అంటూ సెటైర్ వేశారు.
ఇదంతా కుట్ర ప్రకారంగా జరిగిందని ఆరోపించిన పవన్ కళ్యాణ్ మీ ప్రభుత్వం రావడానికి నేను మీకు అండగా నిలబడితే దానికి మీరిచ్చిన ప్రతిఫలం- మీడియా చానళ్ళ ద్వారా నామీద మీడియా అత్యాచారం చేయించడం అని విరుచుకుపడ్డారు. అలాగే ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారో వివరించాడు పవన్ కళ్యాణ్. 10 కోట్ల డబ్బు ఖర్చుపెట్టి, నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి, మా అమ్మ ను బూతులు తిట్టించింది ఎవరో కాదు, దీనికంతటికీ కుట్ర పన్నింది- వర్మ అనే దర్శకుడు, టీవీ9 అధిపతి శ్రీనిరాజు , టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ , లోకేష్ స్నేహితుడు రాజేష్, లోకేష్ కలిసి కుట్రపన్నారని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇదంతా లోకేష్ కనుసన్నల్లో జరిగాయని,ఇవి మీకు తెలియకుండా జరిగాయా అని ముఖ్యమంత్రి ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
మొత్తానికి నేరుగా టీవీ9 పైన, లోకేష్ పైన పవన్ కళ్యాణ్ అస్త్రాలు సంధించడం తో అసలు టీవీ9 ఈ వ్యాఖ్యలను, ఆరోపణలను ఎలా ఎదుర్కొంటుంది అన్న ఆసక్తి నెలకొంది. గతంలో కత్తి మహేష్ కాని, పవన్ కళ్యాణ్ కానీ, శ్రీ రెడ్డి గానీ ఇలా ట్వీట్ చేయగానే అయిదు నిమిషాల్లో టీవీ9, చానళ్ళ ల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చేది. అలాంటిది ఈ వార్తను మాత్రం అన్ని ఛానళ్ళు కాస్త వాయిదా వేసినట్లు కనిపిస్తోంది, తమ చానల్ క్రెడిబిలిటీని దెబ్బతీసే ఈ ఆరోపణలను టీవీ9 ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.