జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నైతిక విలువలు ఉన్న నేతల్ని తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. వచ్చి తన పార్టీలో చేరుతున్న బాలరాజు అనే మాజీ మంత్రి సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో.. మైనింగ్ గురించి తనకు తెలిసినదాన్ని కూడా.. చెప్పారు. వైఎస్ హయాంలో.. జరిగిన తప్పు ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్పారు. నిజానికి ఆ వైఎస్ హయాంలోనే మంత్రిగా ఉన్న బాలరాజునే కదా.. పార్టీలో చేర్చుకుంది. అలా.. ఆ జిల్లా మంత్రిగా ఉన్న .. వ్యక్తి హయాంలోనే మైనింగ్ జరిగితే.. అదే వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటూ నీతులు చెప్పడమా… నైతిక విలువలు..?
ఆధారాలు లేకుండా బురదజల్లడమేనా నైతికత…?
పవన్ కల్యాణ్.. నైతిక విలువల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో నైతిక విలువ పిసరంత అయినా ఉండాలి. ఇప్పటి వరకూ ఉన్నాయి కూడా. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. తనకు అలాంటి విలువలేమీ లేవని పదే పదే నిరూపిస్తూ ఉంటారు. టీడీపీతో బాగున్నంత కాలం.. నాలుగేళ్ల పాటు… ప్రభుత్వం చేస్తున్నదంతా …సూపర్ అన్నట్లుగా ఉన్నారు. ఎప్పుడైతే.. తనకు మరో ఆలోచన వచ్చిందో.. అప్పట్నుంచి బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీవారి బంగారు ఆభరణాల దగ్గర్నుంచి వంతాడ మైనింగ్ వరకూ.. ప్రభుత్వంపై.. ముందూ వెనుకా ఆలోచించకుండా.. ఆరోపణలు చేయడం తప్పా.. ఎనాడైనా.. తను చేసిన ఆరోపణలకు జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేయకపోవడం నైతిక విలువలా..? . నేను ఎయిర్ పోర్టు లాంజ్‌లో ఉంటే.. ఓ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి.. శ్రీవారి ఆభరణాలు విమానంలో తీసుకెళ్లిపోతున్నారని చెప్పారని చెప్పుకోవడం నైతిక విలువనా..? 2010లో ఇచ్చిన మైనింగ్ జీవోతో ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందించడం నైతిక విలువనా..?. ఎన్నో ఆరోపణలు చేసి.. ఒక్క దానికీ ప్రభుత్వం తరపున వస్తున్న వివరణలు. సవాళ్లపై స్పందించకపోవడం నైతిక విలువనా..?
తిట్లు, ట్వీట్లతో కించ పరచడం ఏ తరహా నైతిక విలువ…?
పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ చూసినా.. భాష చూసినా.. ట్వీట్లు చూసినా… ఏ మాత్రం అవగాహన లేని.. ఓ సాదాసీదా మనిషి వ్యక్తిత్వాన్ని పోలి ఉంటాయి కానీ.. రాజకీయాల్లో ఓ హుందాతానికి ప్రతీకగా మాత్రం ఎప్పుడూ ఉండవు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం .. విమర్శిస్తే.. గుర్తు పెట్టుకుని అంతు చూస్తానని హెచ్చరించడం.. పవన్ మార్క్ నైతిక విలువలవుతాయా..?. మీడియాతో గొడవలు పెట్టుకుని.. మీడియా యాజమాన్యాల వ్యక్తిగత ఫోటోలను బహిర్గతం చేసి.. వాళ్లపై దాడులు చేయాలని అభిమానులకు పురికొల్పినట్లుగా ట్వీట్లు చేయడం.. నైతిక విలువలకు నిదర్శనమా..? బట్టలిప్పదీసి మాట్లాడుకుందాం.. గుడ్డలిప్పదీసి కొట్టుకుందాం.. అంటూ సవాళ్లు చేయడం.. జనసేన మార్క్ నైతిక విలువలా..?ఇలా చెప్పుకుంటే…. పుంఖాను పుంఖాలుగా ఉంటాయి. ఆఖరికి నిన్నటికి నిన్న పిల్లలతో కలిసి.. పవన్ కల్యాణ్ జిందాబాద్ అని పలకల మీద రాసి ఫోటోలు దిగి… దానికి .. లోకేష్‌కు కించ పరుస్తూ… హిందీ మాటలు పెట్టి.. ట్వీట్లు చేయడం… జనసేన మార్క్ నైతిక విలువనా..?
తాలుకాయల్లాంటి నేతలే నైతిక విలువలు తెస్తారా..?
జనసేన నేత… పార్టీలు మారేవాళ్లు తనకొద్దని చెబుతూ ఉంటారు. బుల్లెట్లకు ఎదురెళ్లే యువత కావాలంటారు. కానీ.. ఇప్పటికీ… జనసేనలో చేరుతున్న వాళ్లంతా… ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్లు. అందులోనూ.. పరిశీలించి చూస్తే… ఒక్కరంటే.. ఒక్కరికీ ప్రజాబలం ఉండదు. కేవలం… టీడీపీ, వైసీపీల్లో… టిక్కెట్లు రావని కన్ఫర్మ్ అయిన తర్వాతనే… జనసేనలోకి వస్తున్నారు. ఇప్పటికీ… జనసేనలో చేరిన నేతలకు ఎవరికైనా… టీడీపీలో కానీ.. వైసీపీలోకానీ టిక్కెట్ వస్తుందంటే.. ఒక్క క్షణం కూడా జనసేనలో ఉండరు. ఆ విషయం తెలియనంత అమాయకుడేమీ పవన్ కల్యాణ్ కాదు. అలాంటి వాళ్లను చేర్చుకుంటే.. నైతిక విలువల గురించి పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో.. పవన్ కల్యాణ్ ఆలోచించుకోవాలి.
రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నాయి.. దిగజారిపోతున్నాయని బాధపడేవాళ్లే… నిజంగా విలువలు దిగజారుస్తున్నారేమోనన్న అనుమానం జనసేనాధినేతను చూసిన తర్వాత ఎవరికైనా కలిగితే అందులో ఎలాంటి తప్పు ఉండదేమో..?
—– సుభాష్