జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను… పిఠాపురం ప్రజలు.. అక్కడ్నుంచి పోటీ చేయాలని ఆహ్వానించారట. ఆయన పోరాటయాత్రకు వచ్చి ఈలలు వేసి గోల చేస్తున్న యూత్ అంతా.. అక్కడి వారే కాబట్టి.. వారంతా.. అక్కడ్నుంచి పోటీ చేయమని పవన్ కల్యాణ్ కోరినట్లే. మరి అన్ని చోట్లా కుర్రాళ్లు వస్తున్నారుగా…? లాంటి అనుమాలేం పెట్టుకోవద్దు. పవన్ అనుకున్నారు అంతే. పిఠాపురం ప్రత్యేకత శ్రీపాద వల్లభుడేనని అర్థమైందట. ఆయన ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీచేస్తానేమో అని సందేహంలో పడిపయారు. తిరుపతి, అనంతపురం, ఇచ్ఛాపురం నుంచి కూడా తనను పోటీచేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారంటున్నారు. దేన్ని ఎంపిక చేసుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఆ సందర్భంలోనే… ఎంపిక నిర్ణయం తనది కాదని.. సెలక్షన్ కమిటీది అని కూడా చెప్పారు.
అయితే పవన్ కల్యాణ్ పిఠాపురం గురించి అన్యాపదేశంగా చెప్పి ఉండరనే అంచనాలు… గోదావరి జిల్లాల రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతం రెల్లి కులంలో చేరిపోయిన పవన్ కల్యాణ్.. పాత సామాజికవర్గం వాళ్లు అక్కడ ఎక్కువ మంది ఉంటారు. అందుకే అక్కడ ప్రతి పార్టీ కాపు నేతకే టిక్కెట్ ఇస్తుంది. 2009 ఎన్నికల్లో అక్కడ పీఆర్పీ తరపున వంగా గీత గెలిచారు. వెయ్యి ఓట్ల తేడాతో అయినా ప్రస్తుత ఎమ్మెల్యే వర్మపై అప్పట్లో గెలిచారు. కానీ గత ఎన్నికల్లో చంద్రబాబు వర్మకు… టిక్కెట్ ఇవ్వలేదు. అక్కడ కాపు సామాజికవర్గం ఎక్కువ కాబట్టి… విద్యాసంస్థల అధినేత పోతుల విశ్వంకు టిక్కెట్ ఇచ్చారు. కానీ.. వర్మ ఇండిపెండెంట్‌గా అయినా.. టీడీపీ అధికారిక క్యాండేట్‌గా ప్రచారం పొందారు. యాభై వేల మెజార్టీ తెచ్చుకున్నారు. వచ్చే సారి కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ పిఠాపురంపై .. ఆసక్తి పెంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అదే యువత. పిఠాపురం కాపు యువత.. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మహాయాక్టివ్ గా ఉన్నారు. పవన్ పర్యటనకు వస్తున్నారని తెలిసి.. ఫ్లెక్సీలతో ఊరిని నింపేశారు. తూ.గో జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ.. పవన్ అంత గొప్ప ఫ్లెక్సీల స్వాగతం చూడలేదు. అందుకే ఉప్పొంగిపోయారు. అక్కడ పోటీ చే్స్తే.. గెలుస్తానని నమ్మకానికి వచ్చినట్లు ఉన్నారు. అందుకే అక్కడి ప్రజలు పిలుస్తున్నారన్నట్లుగా.. ప్రకటనలు చేస్తున్నారు. పవన్ పోటీ చేస్తానంటే..అన్ని నియోజకవర్గాల పవన్ కల్యాణ్ ఫ్యాన్సూ ఆహ్వానిస్తారు. అందులో కొత్త ..వింత ఏమీ ఉండదు. కానీ పవన్ కల్యాణ్ అలా చెప్పుకోవడమే… కొత్త…వింత కూడా..! . ఇప్పటికైతే.. పిఠాపురం దగ్గరకు వచ్చి ఆగారు.. రేపు గుంటూరుకు వెళ్తే… అక్కడ్నుంచే పోటీ చేస్తానని చెప్పినా… మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదని.. చాలా స్టెట్మెంట్లు నిరూపించాయి కూడా..!