తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో పవన్ కల్యాణ్ బీజేపీ హైకమాండ్ నుంచి హామీ పొందలేకపోయారు. కానీ.. ఖచ్చితంగా బీజేపీ పోటీ చేస్తుందనే సంకేతం కూడా.. రాకుండా జాగ్రత్త పడగలిగారు. తిరుపతిలో ఎవరి బలమెంతో అంచనా వేసుకుని.. ఎవరు పోటీ చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుందో తూకం వేసుకుని ఆ తర్వాత ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసుకోవాలని మాత్రం ఓ అవగాహనకు వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో గంట సేపు ఆయనతో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. వీరి మధ్య ఒక్క తిరుపతి ఉపఎన్నిక అంశంపైనే కాకుండా.. ఇతర అంశాలపై చర్చ జరిగింది. అయితే తిరుపతి ఉపఎన్నిక విషయంలో మాత్రం కాస్త ఎక్కువ చర్చ జరిగినట్లుగా పవన్ కల్యాణ్ మాటలతోనే తెలిసిపోతుంది.
ఇరు వర్గాల చర్చల్లో కమిటీ ప్రస్తావన వచ్చింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో బీజేపీ సాగదీసి చివరికి తమ అభ్యర్థినే నిలబెడుతుంది. ప్రతీదానికి మెత్తబడిపోయే పవన్ కల్యాణ్ తలూపే పరిస్థితి కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. జేపీ నడ్డా పిలిస్తేనే చర్చలకు ఢిల్లీ వచ్చామన్న పవన్ కల్యాణ్… అమరావతి, పోలవరం అంశాలపైనా… స్పష్టమైన హామీ పొందామన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ తీర్మానానికి అనుగుణంగా తమ విధానం ఉంటుందని నడ్డా చెప్పినట్లుగా పవన్ వెల్లడించారు. పోలవరం కూడా జాతీయ ప్రాజెక్ట్ అని పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
అదే సమంయలో ఏపీలోని రాజకీయ పరిస్థితులు… శాంతిభద్రతలు క్షీణించడం.. ఆలయాలపై దాడులు వంటి అంశాలపైనా చర్చించారు. రెండు పార్టీల ఉమ్మడి కార్యచరణపై చర్చించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న పవన్ కల్యాణ్ … ఏపీ వ్యవహారాలు చూసే.. బీజేపీ నేతలతోనూ చర్చలు జరిపారు. మొత్తంగా.. తిరుపతి సీటు విషయంలో తాము ఆషామాషీగా లేమని.. సీరియస్‌గానే ఉన్నామన్న సంకేతాన్ని మాత్రం పంపినట్లుగా తెలుస్తోంది.