“వీడి చర్యలు ఊహాతీతం” అన్నట్టుగా రాజకీయాల్లో ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా ఇవాళ ఉదయం పరిటాల సునీతతో సమావేశం అయి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం అనంతపురంలో ” కరువు యాత్ర” చేస్తూ రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా అనంతపురం లో బాగా ప్రాబల్యం ఉన్న పరిటాల కుటుంబాన్ని పవన్ కలవడం చర్చనీయాంశమైంది .
ముందుగా పవన్ కళ్యాణ్ ని పరిటాల శ్రీరామ్ స్వాగతం పలకగా ఆ తర్వాత పరిటాల సునీతతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ అనంతపురం సమస్యల గురించి ఆవిడతో చర్చించారు. సమస్యలపై మరింత అవగాహన అధ్యయనం కోసమే మంత్రిగారిని కలిశానన్నారు పవన్ కళ్యాణ్. ఈ అధ్యయన ఫలితాలన్నీ తాను ప్రధానమంత్రికి ఇచ్చే నివేదికలో పొందుపరుస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. అలాగే రాయలసీమ ప్రజలలో అమరావతిలో తన భాగస్వామ్యం లేదనే భావన బలంగా ఉందని దీన్ని సరిగ్గా పరిష్కరించకపోతే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని కాబట్టి అన్ని ప్రాంతాలకు ప్రత్యేకించి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు న్యాయం జరిగేలా తమ కార్యాచరణ ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పాడు.
ఇక ఆ తర్వాత మాట్లాడిన పరిటాల సునీత తన నియోజకవర్గంలో తాను 30 చెరువులలో నీళ్లు వచ్చేలా చేశానని తద్వారా కొంత ప్రాంతం పచ్చదనం కనిపిస్తోందని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కి అన్ని విషయాలు తెలియజేసానని, ఆయన తమ ప్రాంత సమస్యలు ప్రధాని దృష్టి కి తీసుకెళ్ళడం అభినందనీయమని అన్నారు. ఇక పరిటాల కుటుంబం తో పాటు ప్రభాకర్ చౌదరి తో కూడా చర్చలు జరిపినట్టు జనసేన సమన్వయకర్తలు చెప్పారు.