జనసేన పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. మరికొంత మంది నేతలు తమ పార్టీ అగ్రనేతల అభిమానం పొందేందుకు గీత దాటిపోతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ ఓ స్పష్టతను ఇస్తూ లేఖ విడుదల చేశారు. కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దని లేఖలో కోరారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దు, బహిరంగంగా చర్చించవద్దని పవన్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి, వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా ప్రతి ఒక్కరూ కలసి రావాలన్నారు.
తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదు, ఇక ముందు కూడా అలాంటి రాజకీయాలు చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనకు తెలిసింది కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవడం, తాను పుట్టిన నేలను అభివృద్ధి చేయడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ముందుకు సాగాలని కోరారు. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
ఇటీవలి కాలంలో జనసేన. పేరు తో కొంత మంది సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. బయట కూడా కొంత మంది కొత్త జనసేన నేతలు అదే పని చేస్తున్నారు. పై స్థాయిలో నేతల మధ్య అంతా బాగానే ఉన్నా.. కింది స్థాయిలో ఐక్యత చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాలని పవన్ తన సందేశంలో స్పష్టత ఇచ్చినట్లయింది.