జనసేన ఏకవ్యక్తి పార్టీ. పవన్ కల్యాణ్ ఒక్కరే కర్తా, కర్మ, క్రియ. ట్విట్టర్ ఒక్కటే అధికార ప్రతినిధి! అయితే, ఆయనకు సలహాలు ఇచ్చేవారూ, ప్రెస్ నోట్లు రాసేవారూ, ట్వీట్లకు కంటెంట్లు ప్రొవైడ్ చేసేవారు.. ఇలాంటి సిబ్బంది ఎవరున్నారో తెలీదుగానీ, వారిని అర్జెంట్ గా మార్చాల్సిన తరుణం ఇదే అని పవన్ గుర్తించాలి. లేదంటే, ఇంకా అభాసుపాలైపోయే అవకాశం సుస్పష్టం. ఈ ఉత్తరాది దక్షిణాది పూనకం పవన్ కి ఎవరు నూరిపోశారోగానీ… ఇప్పటికీ వదలడం లేదు. ఉత్తరాదికి చెందిన ఐ.ఎ.ఎస్. అధికారిని టీటీడీ ఈవోగా నియమించడంపై పవన్ ప్రశ్నించడం వరకూ బాగానే ఉంది. మనవారికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనడంలోనూ తప్పులేదు.
కానీ, అమర్నాథ్, మధుర వంటి క్షేత్రాల్లో దక్షిణాది వారికి ప్రాధాన్యత ఎక్కడుందీ అనే ప్రశ్న నిజంగా అర్థం లేనిది. ఎందుకంటే, ఎక్కడో నేపాల్ లో ఉన్న పశుపతినాథ్ ఆలయం దగ్గర నుంచి ఉత్తరాదిలోని కొన్ని ప్రముఖ క్షేత్రాల్లో ప్రధాన అర్చకులుగా ఉంటున్నది దక్షిణాదివారే. ఆ విషయాన్ని పవన్ దగ్గరున్న రీసెర్చర్లు ఆయనకి చెప్పలేదేమో..! ఇక, ఐ.ఎ.ఎస్. అధికారులంటే దేశంలోని ఎక్కడైనా పనిచేసే అధికారం వారికి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ గురించి కూడా పవన్ కి ఎవ్వరూ సరిగా చెప్పినట్టులేదు. వారిని కొన్ని చోట్ల నియమించుకోవడం అనేది రాష్ట్రాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
సరిగ్గా, ఓ వారం కిందట మిర్చీ రైతు కష్టాలంటూ మీడియాకి ఒక లేఖ విడుదల చేసింది జనసేన. ఆ లేఖలో చంద్రబాబును విమర్శలేక.. కేసీఆర్ ను ప్రశ్నించే ధైర్యం చాలక.. పొడిపొడి మాటలతో రైతుల కష్టాలను అడ్రెస్ చేసే ప్రయత్నం చేశారు. కనీసం ఈ క్రమంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై అయినా కాస్త ఘాటుగా రెండు మాటలు వాడితే బాగుండేది. ‘మిర్చి రైతుల కష్టాలపై నేను సైతం స్పందించాను’ అని చెప్పుకోవడానికి తప్ప… అంతకుమించిన ప్రభావాన్ని సదరు నోట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పుడు టీటీడీ ఈవో విషయంలో కూడా పవన్ ట్వీట్ సందేశం కేవలం అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నట్టుగానే ఉంది. అంతేగానీ, సమగ్రమైన రీసెర్చ్ చేసి, రాసిన మాటల్లా లేవవి.
ఇప్పటికైనా.. ఈ దోషాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలి. ఒక పార్టీ నడిపేందుకు ఒక ట్విట్టరు అకౌంటు, యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్ పేజ్ ఉన్నంత మాత్రాన సరిపోదు. కంటెంట్ తో మాట్లాడేవాళ్లు కావాలి. అలాంటి టీమ్ ఇంకా జనసేనకు సమకూరినట్టు లేదు. ఒకవేళ ఇప్పటికే ఉందనుకుంటే మార్చాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. లేదంటే పవన్ కల్యాణ్ ట్వీట్లు కూడా రానురానూ రామ్ గోపాల్ వర్మ రాతల్లా జనం లైట్ తీసుకునే ప్రమాదం ఉంది.