అక్కడ అమ్మాయి…ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పనవ్ కళ్యాణ్….మొదటి సినిమాతో కలెక్షన్స్ పరంగా సాధించేమీ లేదు. అయితే తను చేసిన స్టంట్స్ అన్నీ కూడా యువతకు రీచ్ అయ్యాయి. ఆ తర్వాత గోకులంలో సీత నుంచి సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బ్రది, ఖుషీ వరకూ కూడా అన్నీ కథా బలమున్న సినిమాలే. అలాగే ప్రతి సినిమాలోనూ పవన్ కూడా ఏదో ఒక స్పెషాలిటీ చూపించేవాడు.
బిల్డప్పులు, హీరోయిజం కంటే కూడా ఓ సాధారణ యువకుడిలాగా, అది కూడా మధ్యతరగతి యువకుడిలాగా కనిపించడానికి ఎక్కువ ప్రయత్నం చేశాడు. పవన్ సినిమాలన్నీ కూడా యూత్‌కి మంచి మెస్సేజ్ కూడా ఇచ్చేలా ఉండేవి. సాంగ్స్ కూడా స్సెషల్‌గా ఉండేవి. ఖుషీ రిజల్ట్‌ని పవన్ కళ్యాణ్ కూడా ఊహించలేదేమో తెలియదు కానీ ఆ తర్వాత నుంచి మాత్రం తను సినిమాలు చేసే స్టైల్, ఆలోచనా విధానం అన్నీ మారిపోయాయి. జానీ సినిమాలో కూడా ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. కానీ గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో అయితే పూర్తిగా పవన్ నిర్లక్ష్యం కనిపించింది. మిగతా సినిమాల్లో కూడా అంతే. సినిమాను సీరియస్‌గా తీసుకున్నట్టు అస్సలు కనిపించేది కాదు. బంగారం, కొమరం పులి లాంటి సినిమాలు అయితే మరీ దారుణం.
బోలెడన్ని ఫ్లాప్స్ తర్వాత గబ్బర్‌సింగ్ సినిమాను మాత్రం కష్టపడి ప్లాన్ చేసుకున్నాడు పవన్. అందుకే ఆ సినిమాలో పవన్ నటన, డ్యాన్సులు, ఫైట్స్…అన్నీ కూడా బాగుంటాయి. విషాదకరమైన విషయం ఏంటంటే అత్తారింటికి దారేది సినిమా మరోసారి ఖుషీ స్థాయి హిట్‌ని ఇవ్వగానే మళ్ళీ పవన్ ఛేంజ్ అయ్యాడు.
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా అయితే ఎందుకు తీశాడో? ఏమనుకుని తీశాడో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. తెరపైన పవన్ కనిపిస్తే చాలు, కథకు సంబంధం లేకుండా కాస్త కామెడీ చేస్తే చాలు.. సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అన్న భ్రమల్లో ఉండి ఆ సినిమా తీసినట్టున్నారు. ఇప్పుడు కాటమరాయుడు సినిమా కూడా అదే పంథాలోనే తెరకెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. గబ్బర్ సింగ్ సీక్వెల్ టైటిల్ లాగే పవన్ కళ్యాణ్ పాడిన సూపర్ హిట్ సాంగ్ నుంచి ‘కాటమరాయుడు’ టైటిల్ తీసుకుని ఇన్స్టెంట్ క్రేజ్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యాం అనుకుంటున్నారు. ఈ సారి కూడా అన్ని విషయాలూ పవన్ కళ్యాణే స్వయంగా చూసుకుంటూ ఉన్నాడన్నది వాస్తవం. ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి అయితే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ పాత ఫొటో ఒకటి తీసుకుని ఫోటోషాప్ చేసి ఇదే ఫస్ట్‌లుక్ అని రిలీజ్ చేసినట్టుగా ఉంది. ఈ సినిమా తెరకెక్కుతున్న తీరును గమనిస్తున్న పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎక్కడ మరో సర్దార్ అవుతుందోనని భయపడుతున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంచుమించుగా నంబర్ ఒన్ పొజిషన్లో ఉన్నాడు పవన్. తన ఫిజికల్ స్టామినా కూడా ఏమీ తగ్గలేదు. ఇంకా కొన్నేళ్ళపాటు సినిమాల్లో యాక్ట్ చేసే కెపాసిటీ పవన్‌కి ఉంది. కానీ ఇలా నిర్లక్ష్యంగా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణి పవన్‌కి అస్సలు మంచిది కాదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫలితం కొన్ని వందల కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. కష్టాన్నే నమ్ముకున్నాను, నిర్లక్ష్యం అనే పదానికి నా జీవితంలో చోటు లేదు అని మాటలు చెప్తూ ఉంటాడు పవన్. అదే విషయాన్ని చేతల్లో కూడా చూపిస్తే ఈ పవర్ స్టార్ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటాడనడంలో సందేహం లేదు.