పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమాని పూర్తి చేసేపనిలో వున్నాడు. మరో రెండు వారాల్లో ఈ సినిమాకి గుమ్మడికాయ్ కొట్టేస్తారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాపై మొన్నటి వరకూ క్లారిటీ లేదు. అయితే నిన్న ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తన ‘ఆక్సిజన్’ సినిమా ప్రమోషన్లో పవన్ కొత్త సినిమా సంగతి చెప్పారు. గతంలో నాన్నగారి నిర్మాణంలో ప్రకటించిన అజిత్ ‘వేదాళం’ రీమేక్ ఆగిపోలేదని, ఈ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ సినిమా ప్రారంభమైందని.. నేసన్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ షూటింగ్ జనవరి 2018 నుంచి ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారాయన. అంటే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా‘వేదాళం’ అని ఫిక్సయిపొయింది.
అయితే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సినిమా సంగతి ఏమిటి అనే చర్చనడుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి హిట్ చిత్రాలతో ఊపుమీదున్న ఈ సంస్థ త్వరలోనే పవన్ కల్యాణ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగం సిద్దం చేస్తోంది. ఈ సినిమాకి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను రెడీ చేసుకున్న సంతోష్ శ్రీనివాస్.. ఆ కధ ను పవన్ కు చెప్పడం, అది ఆయనకు నచ్చడం, మైత్రి మూవీకి ఇది ఫిక్స్ చేయడం జరిగిపోయిందని ఓ వార్తలు వచ్చాయి. తాజాగా మైత్రీ మూవీ ఫిల్మ్ నగర్ లో ఓ ఆఫీస్ తెరించిందని, అక్కడ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని వినిపించింది. ఇలాంటి నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మాదేనని చెప్పారు జ్యోతికృష్ణ.
మరి అలాంటప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఎప్పుడు? వచ్చే ఎన్నికలోగా తన చేతిలో తను ఒప్పుకున్నా సినిమాలన్నీ చేసేయాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. అందుకే క్రేజీ కాంబినేషన్ జోకిలి వెళ్ళడం లేదు. త్రివిక్రమ్ తనకు దర్శకుడు కంటే ఎక్కువ గనుక అజ్ఞాతవాసికి బల్క డేట్స్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో ఆయన చాలా ప్లాన్డ్ గా వుంటారని తెలుస్తుంది. చెక్కుడు కార్యక్రమాలను పక్కన పెట్టి, తను చెప్పేది చేసుకుపోయే దర్శకుల వైపే మొగ్గుచూపుతున్నారని టాక్. ఈ క్రమంలోనే నేషన్, సంతోష్ శ్రీనివాస్ లకు ఆఫర్లు వెళ్లాయని తెలుస్తుంది. ఇంక ఆలస్యం చేయకుండా తను మాటచ్చిన సినిమాలను చుట్టేసి, పొలిటికల్ గ్రౌండ్ లో దిగిపోవాలనేది పవన్ కళ్యాణ్ మొదటి ప్రేయారిటని వినిపిస్తుంది.