పవన్ స్టార్ పవన్ కల్యాణ్… ఈ పేరు అభిమానులకు పూనకాలు తీసుకొచ్చేస్తుంది. వెండి తెరపై పవన్ విశ్వరూపం, నిజ జీవితంలో అంతులేని నిజాయతీ… పవన్‌ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ‘చిరంజీవి తమ్ముడు’ అనే ట్యాగ్ లైన్‌తోనే పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. తనదంటూ స్టైల్‌నీ, తనకంటూ అభిమానగణాన్ని సంపాదించుకోవడానికి పవన్‌కి ఎంతో కాలం పట్టలేదు. వైవిద్యమైన కథలు, వినోదాత్మక పాత్రలతో తిరుగులేని విజయాలు సాధించి నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఓ దశలో పవన్ పట్టిందల్లా బంగారమే. జానీతో సీన్ రివర్స్ అయ్యింది. వరుస పరాజయాలు వెక్కిరించాయి. ఏళ్లకు ఏళ్లు హిట్స్ లేకుండా గడిపేశాడు. అయినా.. పవన్ ఫాలోయింగ్ తగ్గలేదు. సరికదా, సినిమా సినిమాకీ పెరుగుతూ వెళ్లారు. వాళ్ల రుణం ఉంచుకోలేదు పవన్.. గబ్బర్‌సింగ్‌తో మళ్లీ వాళ్లని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచాడు. అత్తారింటికి దారేదితో అంతులేని ఆనందాలు మిగిల్చాడు. ఏ హీరోకైనా వరుసగా అన్ని ఫ్లాపులొస్తే.. ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గుతుంది. క్రేజ్ మాయమవుతుంది. కానీ పవన్ విషయంలో అది రివర్స్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ అభిమానులు విజయాలు చూసి వచ్చినవాళ్లు కాదు, పవన్ వ్యక్తిత్వం చూసి వచ్చినవాళ్లు.
పవన్ మాట్లాడేది తక్కువే. కానీ.. అందులో నిజాయతీ ఉంటుంది. పవన్ తన ఫ్యాన్స్‌ని కలుసుకోవడం అరుదే. కానీ కలసినప్పుడల్లా తన గుండెల్లో ప్రేమ కనిపిస్తుంది. ఇమేజ్‌ని పట్టించుకోకుండా, స్టార్ డమ్ చూసి మురిసిపోకుండా… ఎప్పుడూ నిడారంబరంగా ఉండే పవన్ వ్యక్తిగతం.. ఫ్యాన్స్ గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది. నాకేం రాదు.. నాకేం తెలీదు అని వినమ్రంగా చెప్పుకొనే మాటల్లో పవన్ సింపుల్ సిటీ అర్థం అవుతుంది. అది నచ్చే పవన్ పార్టీ పెడితే అభిమానులే కార్యకర్తలయ్యారు. పవన్ ఏం మాట్లాడినా ఊగిపోతున్నారు. ఇరవై ఏళ్లుగా ఫ్యాన్స్‌ని ఒకేలా సమ్మోహన పరచడం మాటలు కాదు. అది పవన్‌కి సాధ్యమైంది.
పవన్ తన కెరీర్ మొదలెట్టి నేటితో సరిగ్గా ఇరవై ఏళ్లు. పవన్ కెరీర్ హీరోగా మరో ఐదేళ్లు కొనసాగుతుందేమో? ఆ తరవాతేంటి? అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తనని ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఏదో చేద్దామని సంకల్పించాడు. ఆ సంకల్పబలం గొప్పది. అందుకే.. పవన్‌కంటూ మంది,మార్బలం ఏమీ లేకపోయినా, ఆ పార్టీకి జెండా తప్ప ఎజెండా ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా.. గత ఎన్ని కల్లో పవన్ మాట గెలిచింది. ఇప్పుడు పవన్.. అతని సిద్దాంతాలూ గెలవాల్సిన సమయం వచ్చింది. దేన్ని నమ్ముకొని, దేని కోసం రాజకీయాల్లోకి వచ్చాడో దాన్ని సాధించే సమయం దగ్గర పడింది. 2019లో పవన్.. మళ్లీ తన తడాఖా చూపించాలని, తనని నమ్ముకొన్నఅభిమానుల గుండెల్లో ఆనందం నింపాలని కోరుకొందాం.