జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. వైసీపీ సోషల్ మీడియా.. దాదాపుగా యుద్ధాన్నే ప్రకటించింది. మార్ఫింగుల్లో తమను మించిన వారు లేరని.. మరోసారి నిరూపించే దిశగా ఈ యుద్ధంలో కీలక ఘట్టం నడుస్తోంది. ఆరెస్స్ డ్రస్‌ను పవన్‌కు వేయడం దగ్గర్నుంచి అభినవ చేగువేరా.. ఆరెస్సెస్ కార్యకర్తంటూ దుమ్మెత్తి పోయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందంటే.. పవన్ కల్యాణ్… జగన్మోహన్ రెడ్డి “మత ఎజెండా”ను పకడ్బందీగా ప్రజల్లో పెట్టడమే..!
హిందూ స్తోత్రాలకు క్రిస్టియన్ ముద్ర వేస్తున్న వైనం బయట పెట్టిన పవన్ కల్యాణ్..!
చే గువెరాను పవన్ కల్యాణ్ అభిమానిస్తారు. ఆదివారం సాయంత్రం నుంచి పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా విభాగం.. “ఆర్.ఎస్.ఎస్. చేగువెరా పవన్ కల్యాణ్” అని కొత్త ప్రచారాన్ని ప్రారంభించాయి. ఆర్.ఎస్.ఎస్. యూనిఫాం తెల్ల చొక్కా, ఖాకీ నిక్కర్ వేసుకున్న ఓ స్వయం సేవక్ ఫోటోకి పవన్ ఫేస్ మార్ఫ్ చేసి మరీ సోషల్ మీడియాలోకి వదిలారు. దీనంతటికీ కారణం ఆదివారం ఉదయం నుంచి పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్స్. ఆదివారం భాష, మతం లింక్ చేసి పవన్ కల్యాణ్ ట్వీట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆలయాలకీ, హిందువులకీ రక్షణ అవసరం అనే చర్చకు తెరలేపారు. పవన్ ఎక్కడా మతాల పేర్లు తీయకుండానే తన విధానాన్ని వెల్లడిస్తూ హిందూ దేవాలయాలు కట్టే పన్నులు, హిందూ స్తోత్రాలు, అష్టకాలను క్రైస్తవులు ఎలా వాడుకుంటున్నారు అనే విషయాలను చెప్పడంతో ఏపీ రాజకీయంలోకి భాషతోపాటు మతం కూడా ప్రవేశించింది.
మతప్రచార కోణంలోనే ప్రభుత్వ నిర్ణయాలని చెప్పకనే చెప్పిన పవన్ ..!
మాతృ భాష అనేది మనో వికాసానికే కాదు మత ప్రచారానికీ ఒక వాహకం అని చెబుతూ రెండు వీడియోలు అటాచ్ చేశారు. ఘంటసాల గానం చేసిన భగవద్గీతను అనుకరిస్తూ ఓ క్రైస్తవ సభలో క్రీస్తును ప్రార్థిస్తూ సాగిన వీడియో ఒకటి ఉంది. అలాగే ఎస్పీబీ గానం చేసిన శివాష్టకం తరహాలో క్రైస్తవ గీతం మరొకటి. ఈ రెండు వీడియోలు అటు హిందూ, ఇటు క్రైస్తవ సర్కిల్స్ లో చర్చకు తావిచ్చాయి. ఏపీలో పరిపాలనా నిర్ణయాలు జరుగుతున్న విధానాన్ని వాటి ద్వారా చెప్పకనే చెప్పారు. ఈ మధ్య కాలంలో అన్నవరం, అంతర్వేది ఆలయ ప్రాంగణాల్లో హిందూ భజనల పేరిట క్రైస్తవ ప్రచారం చేయడం కలకలం రేపింది. శ్రీశైలం ఆలయంలో అన్యమతస్తుల ఉద్యోగాలు, షాపుల లీజులు వివాదం రేపాయి. టీటీడీలో అన్యమత ఉద్యోగుల వివాదం ఉంది.
ఢిల్లీలో రహస్య చర్చల ఎజెండా ప్రకారమే పవన్ రూటు మార్చారా…!?
ఏపీ సర్కార్ జెరూసలేం, మక్కా హజ్ యాత్రలకు ఇచ్చే సొమ్ము పెంచారు. మరో వైపు హిందువుల దివ్య దర్శనం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చాక నిలిపివేశారు. జెరూసలేం, మక్కా హజ్ యాత్రలకు సొమ్ము పెంచడం అంశం బ్యాక్ గ్రౌండ్ లో చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ లేవనెత్తిన ప్రశ్నల వీడియోను పవన్ కల్యాణ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఆంగ్లంలో ఉన్న రంగరాజన్ మాటల్ని తెలుగులోకి అనువదించి మరో పోస్ట్ వేశారు. ఇందులో హిందూ ఆలయాల నుంచి 23.5 శాతం మేర పన్నులను ప్రభుత్వం వసూలు చేస్తున్న విషయాన్ని ప్రధానంగా రంగరాజన్ లేవనెత్తుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ని ప్రస్తావించారు. పవన్ ఈ మధ్య ఢిల్లీ పర్యటన తరవాతే హిందూ ధోరణులు కనిపిస్తుండటంతో ఆయనపై ఆర్.ఎస్.ఎస్., బీజేపీ ముద్ర వేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని.. ఆ క్రమంలో పవన్ … ట్వీట్లపై ఎదురుదాడి జరుగుతోందంటున్నారు. మరి దీని వెనుక లోగుట్టు ఉందో లేదో.. ఇప్పుడల్లా బయటపడే అవకాశం లేదు.