బీజేపీ-జనసేన కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు..?. సోము వీర్రాజు మాటల్లో చెప్పాలంటే… సందర్భాన్ని బట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ మారుతూ ఉంటుంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చాలా అవసరం ఉంది. తిరుపతి ఉపఎన్నికల్లో ఆయనతో ప్రచారం చేయించుకోవాల్సి ఉంది. ఈ కారణంగా పవన్ కల్యాణే సీఎం అని సోము వీర్రాజు చెబుతున్నారు. జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. సోము మాటలు విని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఏమనుకున్నారో కానీ.. ఖచ్చితంగా ఆయనకు కొంత కాలం కిందట… ఇదే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చి ఉంటాయి.
బీజేపీ-జనసేన గెలిస్తే బీసీకే ముఖ్యమంత్రి పదవి అని కొద్ది రోజుల కిందట.. సోము వీర్రాజు ప్రకటించారు. అప్పుడే గగ్గోలురేగింది. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసు నుంచి తప్పించారని… ఆయనను కించ పరిచారని జనసేన ఫైరయింది. హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో వారు కూడా… హెచ్చరికలు పంపించారేమో కానీ… సోము వీర్రాజు.. వెంటనే సర్దుకున్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేంత పెద్దవాడిని కాదని మాటలు వెనక్కి తీసుకున్నారు. మీడియా వక్రీకరించిందన్నారు. దాంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది. కానీ… జనసేనలోమాత్రం అనుమానపు బీజాలు పడిపోయాయి. అప్పటి నుంచే దూరం పెరుగుతోంది. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికల సమయంలో అది ప్రభావం చూపించకుండా సోము వీర్రాజు..జనసేనకు… ముఖ్యమంత్రి పదవి పేరుతో బిస్కెట్ వేసినట్లుగా భావిస్తున్నారు.
నిజానికి సోము వీర్రాజుకు కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలుఉన్నాయి. బీజేపీ ఏపీ సోషల్ మీడియా టీం .. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేయడానికి అనేక పేజీలు నడుపుతున్నారు. కొన్ని పేజీల్ని ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనలో సహజంగానే అనుమానపు మేఘాలు కమ్ముకుంటాయి. ఇంతకాలం వాటిని క్లియర్ చేయజానికి పెద్దగా ఎవరూ ప్రయత్నించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారా రారా అన్న మీమాంస ఏర్పడటంతో…. కూల్ చేయడానికి సోము వీర్రాజు… సీఎం పవన్ కల్యాణ్ అనే నినాదాన్ని ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. అయితే గతంలో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటన చేసి… తనకు ముఖ్యమంత్రి అభ్యర్తిని ప్రకటించేంద స్థాయి లేదని కవర్ చేసుకున్న ఆయన…. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ప్రకటించారన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే.