పవన్ కళ్యాణ్ తదుపరి జిలా టూర్ దాదాపు ఖరారైంది. ఇటీవలే అనంతపురం జిల్లా లో “కరువు యాత్ర” నిర్వహించిన పవన్ కళ్యాణ్ తదుపరి పర్యటన శ్రీకాకుళం జిల్లాలో చేయనున్నారు. ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాకు వస్తానని పవన్ స్పష్టం చేశారు.
మత్స్యకారుల సమస్య లు తెలుసుకునేందుకు జనసేనాని రంగం సిద్ధం చేశారు. ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాకు వస్తానని స్పష్టం చేశారు. మత్స్యకారులను ఎస్టీలలో చేర్చాలని గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం లో దీక్షలు నిర్వహిస్తున్న వారిని కలవనున్నారు. ‘శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న దీక్ష భగ్నం అయిందని తెలిసింది. ఇక్కడ ఇలా జరగడం బాధాకరం’ అని హైదరాబాద్లో సోమవారం తనను కలిసిన మత్స్యకార నాయకులతో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో జిల్లా పర్యటన తేదీను వెల్లడించారు. మత్స్యకారుల ఇబ్బందులన్నీ తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు.
పవన్ కల్యాణ్ తన పర్యటనలో ‘కొవ్వాడ’ను కూడా సందర్శించే అవకాశాలున్నాయి. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండడంతో మత్స్యకార్లకు పరిహారం సక్రమంగా అందుతుందా లేదా, పునరావాస కాలనీల నిర్మాణం, వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా కృషి చేసే అవకాశముంది. గతంలో శ్రీకాకుళం లోని ఉద్దానం సమస్య పై స్పందించి, ఆ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ స్పందన కూడా రాబట్టిన పవన్ పై శ్రీకాకుళం ప్రజలలో అంచనాలున్నాయి.