త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో భారీ విస్తరణ ఉంటుందని రాజకీయ వర్గాల్లో వేడి వేడి చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీ ,అమిత్ షా మరియు పార్టీ అధినేత జేపీ నడ్డా పలువురి తో జరుపుతున్న చర్చలు ఈ ఊహాగానాలకు మరింత బలం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? కేంద్ర మంత్రి పదవి బిజెపి నిజంగానే ఆఫర్ చేసిందా ? పవన్ కళ్యాణ్ దీనిపై ప్రతిస్పందించాడా? వివరాల్లోకి వెళితే..
మిత్ర పక్షాలకు పెద్దపీట వేసేలా మంత్రివర్గ విస్తరణ
2014 లో ఘన విజయం సాధించిన నాటి నుండి 2020 మొదటి వరకు దాదాపు ఆరేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగిన మోడీ ప్రభ కరోనా మొదలైన నాటి నుండి కొద్ది కొద్ది గా మసక బారుతూ వచ్చింది. దాంతో పాటు వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు కొన్ని అధికార అనధికార మిత్ర పక్షాలను బీజేపీ కి దూరం చేశాయి. దీంతో మిత్ర పక్షాలు దూరం కావడం వల్ల మంత్రి పదవుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా కరోనా విపత్తు సమయంలో సరిగా పని చేయని మంత్రులకు ఉద్వాసన పలికే యోచన లో మోడీ ఉన్నట్టు తెలుస్తోంది . దీంతో పాటు 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మిత్రపక్షాల ను కలుపుకుని వెళ్లే రీతిలో మంత్రివర్గ కూర్పు ఉండేలా మోడీ ప్రయతి స్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మిత్ర పక్షమైన జెడియు కి ఈసారి మంత్రి వర్గ విస్తరణలో భారీ గా అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.
మిత్ర పక్షాలకు సముచిత పదవులతో పాటు అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అనే ఎజెండా:
మిత్ర పక్షాలకు కు సముచిత పదవులతో పాటు అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం అనే అంశం కూడా ఈసారి మంత్రి వర్గ కూర్పులో మోడీ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ నుండి ఒకరి కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే పనైతే జీవీఎల్ నరసింహారావు కు ఆ పదవి ఇప్పించాలని వైఎస్ఆర్ సిపి నేతలు బలంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం . జీవీఎల్ నరసింహారావు లోపాయికారిగా వైఎస్ఆర్సిపి కి అనుకూలం గా వ్యవహరిస్తుంటారు అనే విమర్శలు ఆయనపై చాలాకాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పదవి ఇప్పించడం కోసం వైఎస్సార్సీపీ ప్రయత్నాలు చేస్తోంది అని ఆ పార్టీ అనుకూల మీడియా రాస్తున్న వార్తలు ఎవరికీ ఆశ్చర్యం కలిగించడం లేదు.
హఠాత్తుగా తెరపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ పేరు
కేంద్ర మంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు వస్తుందని ఏనాడూ వార్తలు రాలేదు, అభిమానులు అందుకోసం తపన పడడమూ జరగ లేదు. కానీ హఠాత్తుగా ఆంధ్ర ప్రదేశ్ నుండి పవన్ కళ్యాణ్ కు పదవి ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు రావడానికి ప్రధాన కారణం ఆర్ ఎస్ ఎస్ లో ప్రముఖుడైన బి ఎల్ సంతోష్ పవన్ కళ్యాణ్ కి పదవి ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఢిల్లీ లోని కొన్ని వర్గాల నుండి లీక్ కావడమే. కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య కు బంధువు అయిన బీఎల్ సంతోష్ మాట ఎంతగా చెల్లుబాటు అవుతుంది అన్న సంగతి ఆర్ఎస్ఎస్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీ అమిత్ షా ల కు నచ్చని కొందరు వ్యక్తులకు కూడా సంతోష్ కారణంగా కేంద్ర మంత్రివర్గంలో మరియు ఆయా రాష్ట్రాలలో పదవులు వచ్చాయని బిజెపిలో చెబుతూ ఉంటారు. బిజెపి జనసేన ల మధ్య పొత్తు పొడవడానికి కూడా బి ఎల్ సంతోష్ మధ్యవర్తిత్వం కారణం అని రాజకీయవర్గాల్లో చెబుతూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ కోరుతోంది కేంద్ర మంత్రి పదవి కాదు, అది వేరే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ:
అయితే బిజెపి తో పొత్తు పెట్టుకునే ముందు జనసేన తరపున బిజెపి ని ఒకే ఒక స్పష్టత పవన్ కళ్యాణ్ కోరాడని సమాచారం. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ తో బిజెపి అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఏ విధమైన అవగాహన కానీ, పొత్తు కానీ, లోపాయికారి కుమ్మక్కు కానీ చేసుకోదు అన్న స్పష్టత ఉంటేనే జనసేన బీజేపీ తో పొత్తు పెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ మొదట్లోనే బిజెపి పెద్దలకు చెప్పినట్లు సమాచారం. అప్పట్లో బిజెపి పెద్దలు- తెరవెనుక కానీ ముందు కానీ వైఎస్సార్సీపీ పార్టీ తో కానీ టిడిపి తో కానీ ఎటువంటి పొత్తు బీజేపీ పెట్టుకోదని, జనసేన తో మాత్రమే కలిసి వెళుతుందని హామీ ఇచ్చారని సమాచారం.
అయితే ఇది ఇలా ఉంటే, తాజాగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు కొందరు వైఎస్సార్సీపీ తో కుమ్మక్కు కావడమే కాకుండా, ఢిల్లీ స్థాయి బిజెపి పెద్దలు కొందరు జగన్ కు సహకరిస్తున్నారని సమాచారం పవన్ కళ్యాణ్ కు అందిందని, పవన్ కళ్యాణ్ ఆ మధ్య బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి కారణం నిజానికి తెలంగాణ బిజెపి నేతలు కాదని, ఢిల్లీ బిజెపి పెద్దలు కొందరు జగన్ బెయిల్ రద్దు కాకుండా ఉండడానికి జగన్ ఆయా అధికారులతో చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడమే నని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానాలు సైతం ఆయా సంస్థలు సమర్పించే డాక్యుమెంట్ల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అయితే ఆధారాలు డాక్యుమెంట్లు సమర్పించవలసిన అధికారులని ప్రభావితం చేయడానికి కొందరు బిజెపి పెద్దలు జగన్ కు సహకరిస్తున్నారనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ బీజేపీ పై కినుక వహించాడని గుసగుసల సారాంశం.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సమాచారం అంతటినీ ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లాడని, పొత్తు పెట్టుకునే సమయంలో హామీ ఇచ్చినట్లుగా జగన్ తో ఎటువంటి కుమ్మక్కు లేకుండా బిజెపి ప్రవర్తించాలని, సంస్థల మీద ఒత్తిడి తెచ్చేలా జగన్ కు సహకరిస్తున్న కొందరు బిజెపి పెద్దలను దారిలోకి తీసుకురావడం ద్వారా చట్టం తన పని తాను చేసుకుని చేయాలని పవన్ కళ్యాణ్ బిజెపి పెద్దలను కోరినట్లు సమాచారం. ఈ ఒక్క విషయం తప్పించి మరే రకమైన పదవులను పవన్ కళ్యాణ్ బిజెపిని కోరలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి పై ఆసక్తి లేదని తెలుస్తోంది. జగన్ కేసుల విషయంలో, చట్టం తన పని తాను చేసుకుపోయేలా చెయ్యాలని, సంస్థలని ప్రభావితం చేసేలా జగన్ కు లోపాయికారి గా సహకరిస్తోన్న బీజేపీ నేతలను దారి లో కి తీసుకొచ్చి ఏపీ విషయంలో సీరియస్ రాజకీయాలు చేయాలి అని పవన్ బీజేపీ పెద్దలని కోరుతున్నారని సమాచారం.
ఏది ఏమైనా ప్రస్తుతానికి ఇవన్నీ గుసగుసలే. మరి పవన్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది వేచి చూడాలి.