మరో సమస్యపై ఉద్యమించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమౌతున్నారు. ఈసారి చేనేత కార్మికుల కష్టాలపై జనసేనాని స్పందించారు! నేతన్నల సమస్యలపై అధ్యయం చేసి, వారికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని తాజాగా ప్రకటించారు. చేనేతలకు బ్రాండ్ అంబాసిండర్గా ఉంటాననీ, వారానికి ఒకరోజున తాను చేనేతలే ధరిస్తానని పవన్ తన పార్టీ ఆఫీస్లో ప్రకటించారు. చేనేతలకు ఆయన బ్రాండ్ అంబాసిండర్గా ఉండటం చాలా మంచి నిర్ణయమే! నిజానికి, రాజకీయ పార్టీల నిర్లక్ష్యానికి గురౌతున్న సమస్యలను పవన్ ఓన్ చేసుకుంటున్న తీరు మెచ్చుకోదగ్గదే. ప్రత్యేక హోదా, ఉత్తరాది ఆధిపత్యం.. ఇలాంటి ఇష్యూస్తోపాటు.. నేత కార్మికులు, రైతులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా పవన్ నిలుస్తున్నారు. అయితే, ఈ క్రమంలో పవన్ పోరాటాలపై జనసేన విశ్లేషించుకోవాల్సిన సందర్భం ఇది! ఎందుకంటే.. పవన్ పోరాటాల్లో ఆరంభం బాగుంటోంది, అంతిమ లక్ష్యమే పూర్తిస్థాయిలో నెరవేడం లేదు!
ఈ మధ్యనే శ్రీకాకుళం జిల్లాకు చెంది కిడ్నీ బాధితులపై పవన్ స్పందించారు. నిర్లక్ష్యానికి గురౌతున్న ఉద్దానం ప్రజల తరఫున నిలబడ్డారు. దాంతో ప్రభుత్వం కదిలొచ్చింది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పేదవారికి ఉచిత బస్ పాసులు ఇవ్వాలనీ, చికిత్సలు అందించేందుకు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఆ తరువాత, శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కూడా ముఖ్యమంత్రి ఇదే మాట చెప్పారు. అయితే, వాస్తవంలో పరిస్థితి ఎలా ఉందంటే… చంద్రబాబు ఆదేశాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు! బస్ పాసుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక, చికిత్స గురించి మాట్లాడుకునే పరిస్థితే లేదు! మళ్లీ ఇప్పుడా ప్రజలు పవన్ తమవైపు చూస్తారేమో అని ఎదురుచూస్తున్నారు.
అంతకుముందు, తుందుర్రు ఆక్వా రైతుల సమస్యా అంతే! తమ బతుకుల్ని బండలు చేస్తున్న తుందుర్రు ఆక్వా మెగా ప్రాజెక్టును వేరే ప్రాంతానికి మార్చాలని ఆ ప్రాంత రైతులు పవన్ను ఆశ్రయించారు. యథావిధిగా ప్రభుత్వం స్పందించేసింది! ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులేవీ ఉండవని చెప్పేసింది. కానీ, అక్కడ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని అంటున్నారు! ఆక్వా రైతుల ఆవేదన అలానే ఉందని తెలుస్తోంది! అంతముందు, రాజధాని ప్రాంత రైతుల విషయంలోనూ పవన్ స్పందించారు. బలవంతపు భూసేకరణ ఉండదని నాడు ప్రభుత్వం ప్రకటించింది. భూసేకరణ నోటిఫికేషన్ కూడా పేసింది! కానీ, ఆ తరువాత జరగాల్సింది జరుగుతూనే ఉంది.
పవన్ కల్యాణ్ నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు. ప్రజలు కష్టాలను అర్థం చేసుకుంటారనీ, తమ తరఫున పోరాడి న్యాయం చేస్తారని అనుకుంటున్నారు. పవన్ పోరాటం ప్రారంభం వరకూ బాగానే ఉంటోంది! కానీ, ప్రభుత్వం చెప్పిన మాటలు కార్యరూపం దాల్చడం లేదు. దీంతో పవన్ పోరాట ఫలితాలు వాస్తవంలో కనిపించకుండా పోతున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇదే విషయాన్ని జనసేనాని పునః సమీక్షించుకోవాలి. ఏ సమస్యపైన అయినా పవన్ పోరాటం బాగానే ఉంటోంది. దాంతోపాటు ఫలితాలు వచ్చే వరకూ కూడా పవన్ తన పోరాటాలను ఫాలోఅప్ చేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.