పవన్ కల్యాణ్ ఇప్పుడు కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు. జనసేన పార్టీ అధినేత కూడా! ఆయన ఇటీవలి కాలంలో ప్రజల ముందు వచ్చిన వివిధ సందర్భాలు, కేవలం ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాత్రమే కావడం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. జన సేన పార్లీకి ఎన్నికల సంఘం గుర్తింపు కూడా వచ్చేసింది. ఆయన పార్టీ ప్రకటించిన తొలిరోజుల్లో సాగిన ఊహాగానాలు నిజమై ఉంటే గనుక.. మొన్న ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన కూడా పోటీచేసి ఉండాల్సింది. అయితే ఇప్పటికి జనసేన పార్టీ ఆవిర్భవించి రెండేళ్లు గడుస్తోంది. అయినా సరే పార్టీకి సంబంధించి ఒక కార్యాచరణ, కనీసం అలాంటి ఆలోచన ఏదీ పవన్ కల్యాణ్‌కు ఉన్నట్లు లేదు. ఇప్పటిదాకా పవన్ తాను పార్టీకి అధ్యక్షుడు అని చెప్పుకోవడం తప్ప పార్టీ కమిటీని కూడా వేయలేదు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం.. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖపట్నంలో ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నారట. రాష్ట్రంలోని యువత సగం వరకు పవన్ కల్యాణ్ వెంట ఉన్నదనే సంకేతాలు అందరికీ తెలిసేలాగా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని ఆయన ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారట. జాతీయ సమైక్యత, ప్రజాధనానికి కాపలా, ప్రభుత్వాల పనితీరుపై నిఘా వంటి లక్ష్యాలతో జనసేన పార్టీ స్థాపిస్తున్నట్లు పవన్ గతంలో చెప్పారు.
అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం అనే వేడుక నిర్వహణ గురించి పవన్ కల్యాణ్‌కు మాత్రం ఎలాంటి ఆసక్తి లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు ఏమీ అవసరం లేదని, ఆరోజున తాను ఎవ్వరికీ అందుబాటులో ఉండబోయేది కూడా లేదని పవన్ అంటున్నట్లుగా పుకార్లు పొక్కుతున్నాయి. ఇప్పుడు అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో పవన్‌కు మిత్రపక్షాలే రాజ్యం చేస్తున్నందున.. తాను పెద్దగా నిలదీయడానికి ప్రశ్నించడానికి ఏమీ ఉండదు గనుకనే.. పవన్ ఆవిర్భావ కార్యక్రమమే వద్దని అంటున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ ఒత్తిడికి ఆయన ఎంత తలొగ్గుతారో, తన నిర్ణయానికి ఫ్యాన్స్‌ను ఎలా ఒప్పిస్తారో చూడాలి.