పవన్ కల్యాణ్ ప్రారంభించిన బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో పూర్తి కాబోతోంది. బుధవారం నుంచి విజయనగరం జిల్లాలో ప్రవేశించబోతోంది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ ప్రజా పోరాట యాత్ర ప్రారంభానికి ముందు, ఇతర పార్టీల నుంచి జనసేనలోని నేతల చేరికల గురించి విశాఖలో పవన్ కొన్ని మాటలు చెప్పారు. వాటిని ఒక్కసారిగా మననం చేసుకుంటే… యాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందే పవన్ విశాఖ వచ్చారు. అంబేద్కర్ భవన్ లో తాను అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నానని చెప్పారు. సరిగ్గా ఆ సమయంలోనే మీడియాతో మాట్లాడుతూ… జనసేనలోకి చేరేందుకు సీనియర్ నాయకులు సిద్ధంగా ఉన్నారని పవన్ చెప్పారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల బస్సు యాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు.
పవన్ చెప్పిన మూడు జిల్లాల్లో ఒక జిల్లా యాత్ర పూర్తి కాబోతోంది. కానీ, ఇంతవరకూ శ్రీకాకుళంలో జనసేనలోకి కొత్తగా చేరిన కీలక నేతలు ఎవ్వరూ లేరు..! కనీసం కొత్తవారిని చేర్చుకునే వాతావరణం కూడా కనిపించలేదు. పైగా, శ్రీకాకుళం జిల్లాలో పవన్ విమర్శల పాలయ్యే వ్యాఖ్యలు చేశారు. గౌతు శివాజీ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. స్థానికంగా ఆయనపై ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన మీద కూడా పవన్ రొటీన్ గా అవినీతి ఆరోపణలు చేసేశారు. దీంతో పవన్ అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నట్టయింది. శ్రీకాకుళం పర్యటనలో ఇది మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ విషయం పవన్ ద్రుష్టికి వెళ్లిందో లేదోగానీ, స్థానికంగా కొంత చర్చ అయితే జరిగింది. పవన్ పార్టీలోకి వద్దామనుకునే స్థానిక నేతలకు ఇలాంటి ఘటనలు కొంత ఆపుతాయి కదా.
పవన్ యాత్రలకు జనం బాగా వస్తున్నారు. వస్తారు.. ఎందుకంటే, పవర్ స్టార్ కదా! అయితే, వచ్చిన జనాలను ఒక రాజకీయ నాయకుడిగా పవన్ ఆకర్షిస్తున్నారా, లేదంటే ఒక సినీ తారగానే అభిమానం పొందుతున్నారా అనేదే ఇప్పుడు అసలు చర్చ! ఈ యాత్ర ద్వారా పార్టీ విస్తరణ జరుగుతుందని ముందుగా చెప్పారు. కొత్త నేతల చేరిక ఇబ్బడిముబ్బడిగా జరుగుతుందని ఆయనే స్వయంగా అన్నారు. కానీ, నేతల చేరిక అనేది ఇప్పట్లో ఉండే కార్యక్రమంగా కనిపించడం లేదు. దీని ద్వారా అర్థమౌతున్నది ఏంటంటే… బస్సు యాత్ర కార్యక్రమానికి ఆదరబాదరాగా పవన్ బయలు దేరేశారన్నట్టుగా అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ అన్నారు. అలాంటప్పుడు నాయకుల చేరిక కూడా అత్యవసర కార్యక్రమమే. ఈ యాత్రలో కనీసం కొంతమందినైనా చేర్చుకుంటే ఊపు ఉండేది. పవన్ ఫస్ట్ టైమ్ జనాల్లోకి రావడం కదా… ఇప్పుడు జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇదే ఊపులో చేరికలు ఉంటే బాగుండేది. కానీ, జనసేన సిద్ధం కాలేకపోయింది. ఒక తారగా ప్రజలను ఆకర్షిస్తున్నా… ఒక నాయకుడిగా పవన్ ను నమ్మి పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు కూడా రావాలి కదా.