ఇటు సినిమా – అటు రాజకీయం అంటూ రెండు పడవల పై ప్రయాణం చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈమధ్యైతే… సినిమాలపై కాస్త ఫోకస్ పెరిగింది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. చక చక సినిమాలు చేసి, ఎన్నికలకు కావల్సినంత మూలధనం సమకూర్చుకుని, ఆ తరవాత.. ఎన్నికల బరిలోకి దిగాలన్నది పవన్ ప్లాన్. అందుకే ఒకేసారి రెండు మూడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లిపోయాడు. కొత్త కథలు వెంట వెంటనే ఓకే చెప్పేస్తున్నాడు.
ఇటీవల పవన్ దగ్గరకు ఓ పొలిటికల్ డ్రామా వచ్చింది. ఇదో రీమేక్ కథ. పవన్ చేస్తే బాగానే ఉంటుంది కూడా. అయితే పవన్ మాత్రం `నో` చెప్పాడట. “బయట ఎలాగూ పాలిటిక్స్ చేస్తున్నా, సినిమాల్లో కూడా అదే చూపించడం ఎందుకు“ అన్నది పవన్ సమాధానంగా వినిపించింది. సాధారణంగా రాజకీయ జీవితంలోనూ ఉండే సినిమా స్టార్స్, పొలిటికల్ నేపథ్యంలో కథల్ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తమ పొలిటికల్ కెరీర్‌కీ మైలేజీగా ఉపయోగపడుతుందన్నది వాళ్ల ఆలోచన. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నప్పుడు పొలిటికల్ డ్రామాలు ఎక్కువగా చేశారు. అప్పట్లో ఎంజీఆర్ కూడా అంతే. కానీ పవన్ మాత్రం ఇందుకు విభిన్నంగా స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.