పవన్‌కళ్యాణ్‌పై కత్తి మహేష్ వ్యాఖ్యల వివాదం ఒక దండగమారి వ్యవహారం. నిరర్థక పురాణం. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను.శనివారం నాడు టీవీ9లో ఆయన సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత 10టీవీలో రాత్రి ముగింపు ఎప్పుడు అని చర్చ పెట్టారు. దేవితో పాటు విజయవాడ నుంచి నేను కూడా పాల్గొన్నాను. వివిధ పక్షాలు వివాదం ముగించాలని, అభిమానులనే వారు విచక్షణ కోల్పోకూడదని చర్చ సారాంశం. భావ ప్రకటనా స్వేచ్చ మహిళలపై దాడి వంటి అంశాలను దేవి ప్రస్తావించారు. దాంతో పాటు కత్తి మహేష్ కూడా సుప్రభాతంలాగా ఉదయాన్నే పవన్‌పై ఏం ట్వీట్ అని ఆలోచించడం మానేయాలని నేనన్నాను.సోషల్‌మీడియానే గాక మెయిన్స్ట్రీమ్లోని ఫ్రంట్‌లైన్ ఛానల్స్ దీన్ని పెంచతున్నాయని విమర్శించాను. విచిత్రమేమంటే అభిమానులు మా పైనా అదే విధమైన దాడికి దిగడం. చర్చలో పాల్గొన్న ఒక మహిళపై వారి భాష చూస్తే ఆగ్రహం కలుగుతుంది. అజ్ఞాతవాసి టైటిల్‌కు తగినట్టే మౌనం వహిస్తున్న పవన్ ఈ దురాగ్రహానికి కుసంస్కారానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత గుర్తించడం అవసరం. లేకంటే పరోక్షంగా వీటిని ప్రోత్సహించినట్టే అనుకోవాల్సి వస్తుంది.