జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్లో చాలా చెబుతూంటారు. ఏదైనా బాధకరమైన ఘటన గురించి చెప్పాల్సి వస్తే గుండె తరుక్కుపోయిందంటారు. రెండు రోజులు అన్నం మానేశానంటారు. నాలుగు రోజులు గదిలో నుంచి బయటకు రాలేదంటారు. ఆయన మాటలను చూస్తూంటే.. పవన్ కల్యాణ్ అత్యంత సున్నిత మనస్కుడనుకుంటారు. అలాంటి వ్యక్తి.. తన కోసం.. ప్రాణాలు పోగొట్టుకున్న అభిమానుల కోసం.. వారి కుటుంబం కోసం.. ఉన్న పళంగా ఏమైనా చేస్తారని అనుకుంటారు. కానీ పవన్ ఈ విషయంలో అంచనాలను … తలకిందులు చేసేశారు.
పవన్ కల్యాణ్ విశాఖ జిల్లాలో పోరాటయాత్ర చేస్తున్నారు. ఆయన పాయకరావుపేటలో ఓ రోజుయాత్ర చేయాలనుకున్నారు. అక్కడి కూడలిలో ప్రసంగించాలనుకున్నారు. విషయం తెలిసిన అభిమానులు… రెక్కలు, ముక్కలు చేసి సంపాదించుకున్న సొమ్ముతో… ఫ్లెక్సీలు చేయించుకున్నారు. వాటిని కట్టబోయి ప్రమాదానికి గురయ్యారు. కరెంట్‌కు షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. చనిపోయిన ఇద్దరూ మెగా ఫ్యామిలీకి వీరాభిమానులు. తమ తల్లిదండ్రులు, పెళ్లాం, పిల్లలకు… పండుగలకు కొత్త బట్టలు కొంటారో లేదో.. కానీ మెగా హీరోల సినిమాలొస్తే మాత్రం… ధియేటర్ను అలంకరిస్తారు. మొదటి రోజు..మొదటి షో చూసి… సినిమా ఎలా ఉన్నా.. అద్భుతంగా ఉందని.. మౌత్ టాక్ స్ప్రెడ్ చేయడానికి తమ సమయం అంతా వెచ్చిస్తారు. ఇంతా చేసి .. వీరిద్దరూ… తోపుడు బండ్ల మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే చిరు వ్యాపారాలే. మూడు పదుల వయసులో ఉన్న వీరిద్దరే కుటుంబాలకు ఆధారం. వీరు ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబాలు దిక్కులేనివయ్యాయి.
కానీ పవన్ కల్యాణ్ కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదు. చాలా బాధగా ఉందని ఓ ప్రకటన చేశారు. త్వరలో వచ్చి పరామర్శిస్తానని ప్రకటన చేశారు. కుటుంబానికి అండగా ఉంటానన్నారు. తన పార్టీ తరపున కొంత మంది నేతల్ని పంపించారు. కానీ అభిమానం కోసం.. కుటుంబాల్నే అనాధలు చేస్తే.. ఆ అభిమానం పొందిన వ్యక్తి … గంట ప్రయాణ దూరంలో ఉండి కూడా.. వెళ్లడానికి మనసొప్పలేకపోయింది. యాత్ర చేసుకుంటూ.. పాయకరావు పేట వెళ్లినప్పుడు వారిని పరామర్శించడం మానవత్వం అనిపించుకోదు. తృణమో..పణమో ఇస్తే.. ఇది ఆదుకోవడం అనిపించుకోదు.
ఏదైనా ప్రమాదం జరిగో.. మరో విషాదం జరిగితే… శవ రాజకీయం చేసుకోవచ్చనుకుంటే.. పరుగెత్తుకు వెళ్లిపోయే మనస్థత్వం ఉన్న నేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ శవ రాజకీయం చేసుకున్నా.. బాధితులకు, బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ధైర్యం ఇచ్చేలా వ్యవహరించగలిగితే.. అంతకంటే వారికి కావాల్సింది ఏముంటుంది..? ప్రాణాలు తెచ్చివ్వలేరు. కానీ తనపై అభిమానం కోసం ప్రాణాలను పోగొట్టుకున్న … ఆ అభిమానుల కుటుంబాలపైనైనా కాస్తంత కనికరం చూపించాల్సింది. సొంత అభిమానులను.. తన పని చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటే పట్టించుకోని నేత.. రేపు ప్రజలను ఎలా .. చూసుకుంటాడన్న విమర్శలు.. రాకుండా ఉండేవి.
—-సుభాష్…