ఎన్నికలకు మూడు నెలల ముందే.. పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఈ మూడు నెలలూ పూర్తిగా రాజకీయాలవైపే దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఏపీ ఎన్నికలు అయిపొయాయి. పవన్ కూడా రిలాక్స్ అయ్యాడు. దాంతో పవన్ సెట్లోకి ఎప్పుడు అడుగు పెడతాడు? ముందుగా ఏ సినిమా షూటింగ్ పూర్తి చేస్తారు? అనే ఆసక్తి మొదలైంది. అయితే పవన్‌కు ఇంకా పొలిటికల్ మూడ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకూ పవన్ సినిమా సెట్లోకి అడుగు పెట్టే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ… ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తే, సినిమాల వైపు పవన్ రాక మరింత ఆలస్యం అవుతుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరవాత గానీ, పవన్ సినిమాల గురించి ఆలోచించేంత తీరిక ఉండకపోవొచ్చు. పైగా పవన్ ఇప్పుడు షూటింగులకు రెడీగా లేడు. తన ఫిజిక్‌పై మళ్లీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. జూలై తొలి వారం వరకూ పవన్ సెట్లో అడుగు పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. అప్పుడు కూడా ముందుగా ‘ఓజీ’ పూర్తి చేస్తాడు. ఆ తరవాత ‘హరి హర వీరమల్లు’కు కొన్ని డేట్లు కేటాయిస్తాడు. ఇవి రెండూ అయ్యాకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉంటుంది. నిర్మాతలు కూడా పవన్‌పై ఒత్తిడి తీసుకుని రావడానికి ఇష్టపడడం లేదు. కాస్త ఆలస్యమైనా పవన్ పూర్తిగా సిద్ధమయ్యాకే చిత్రీకరణలు మొదలెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు.