తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై సమాలోచనలు జరుపుతున్నామని, త్వరలోనే క్లారిటీ ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే మరో మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వస్తుందని జనసేన పార్టీ నేత తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నడుస్తున్న 99టీవీ లో వార్తలు వస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
ముందస్తు కాకుండా వచ్చే ఏడాదే ఎన్నికలు వస్తే 23 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా అనుకున్నామని.. అలాగే మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావించామని పేర్కొన్నారు. ముందస్తుకు వెళ్లడంతో తమ పార్టీ పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొందని తెలిపారు . అయితే కొంత మంది స్వతంత్రంగా నిలబడతామని, తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారని పవన్ చెప్పారు.
అయితే చాలా మంది ఊహించినట్లే, పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే, మహాకూటమిలో సీట్ల ఖరారు అయ్యేంత వరకు వేచి చూసినట్టు అర్థమవుతోంది. ఇప్పుడు మహాకూటమిలో సీట్ల ఖరారు కావడంతో, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేలా పవన్ కళ్యాణ్ వ్యూహ రచన చేసే అవకాశాలు ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనా జనసేనాని వ్యూహం ఏంటనేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలియనుంది