జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనల లో బహిరంగ సభలతో బిజీగా ఉంటూనే మరొకవైపు వేర్వేరు వర్గాల తో సమావేశం అవుతున్నారు. అందులో భాగంగా విద్యార్థులతో సమావేశం అయిన పవన్ కళ్యాణ్, జనసేన ఎడ్యుకేషన్ పాలసీ గురించి వివరించారు. విద్యావ్యవస్థలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలాగే ఈ సభలో మాట్లాడుతూ ఫీజ్ రియంబర్స్మెంట్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జనసేన ఎడ్యుకేషన్ పాలసీ:
ఎంతోమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు అంటే దానికి కారణం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఎలా ఉన్నాయో వారికి తెలిసి ఉండడమే అన్నారు పవన్ కళ్యాణ్. అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది మనకు లేకుండా పోయిందని, అందువల్లే చదువులంటే పిల్లలకు భయం అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆల్జీబ్రా, కాలిక్యులస్, సైన్సెస్ లాంటి అంశాలకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ వర్తింప చేయాల్సిన అవసరం ఉందని, అలా చేసినప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా సులభంగానే అనిపిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మన విద్యాసంస్థలలో అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి జనసేన గట్టిగా ప్రయత్నిస్తుందని వివరించారు. థామస్ అల్వా ఎడిసన్, ఐన్‌స్టీన్ లాంటి ఆవిష్కర్తలు సంప్రదాయక విద్య నేర్చుకోలేదని గుర్తు చేశారు. విద్య అనేది విద్యార్థులను సమగ్రంగా అభివృద్ధి ( హోలిస్టిక్ డెవలప్మెంట్) చేసేలా ఉండాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తన విద్యార్హత మీద విమర్శలకు సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అర్హత కేవలం ఇంటర్మీడియట్ అని అలాంటి పవన్ కళ్యాణ్ తమకు చెప్పేది ఏంటి అని అప్పుడప్పుడు కొంతమంది విమర్శిస్తుంటారు. ఈ సమావేశంలో దాని మీద కూడా పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాన్సెప్ట్స్ భోధించకుండా బట్టీ పట్టే చదువులకు, తనకు సరి పడలేదని, అయితే తాను ఎన్నో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. అలాగే థామస్ అల్వా ఎడిసన్, ఐన్‌స్టీన్ ఇలాంటి ఆవిష్కర్తల తో పాటు ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా సంప్రదాయక స్కూల్లో చదువుకున్న వారు కాదని గుర్తు చేశారు. అలాగే ఒక ఉద్యోగం చేయడానికి నాలుగైదు ఏళ్లు కష్టపడేటప్పుడు, ఎంతోమందిని ప్రభావితం చేసే పాలసీలు రూపొందించేవారు ఇంకెంత కష్టపడాలని తనకు అనిపించిందని అందుకే ఒక దశాబ్దం పైగా నే ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించానని, రాబోయే 2019 ఎన్నికలు తనకు మూడవ ఎన్నికలు అని చెప్పుకొచ్చారు. ఒక రంగంలో సూపర్ స్టార్ అయినంత మాత్రాన రాజకీయాల్లో విజయం సాధించాలనే రూల్ ఏమీ లేదని, రాజకీయాల్లో విజయం సాధించడానికి అనేకానేక విషయాలు నేర్చుకోవాలని, వాటన్నింటినీ తాను ఒక దశాబ్దం పాటు పట్టుదలతో నేర్చుకున్నానని వివరించారు.
ఫీజ్ రియంబర్స్మెంట్ మీద పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటు ప్రభుత్వాలు కానీ అటు ప్రతిపక్ష నాయకులు కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ చేస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారని, కానీ అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకని, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే , విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని అన్నారు. ముందేమో ఫీజ్ వసూలు చేసి, ఆ తర్వాత దాన్ని రియంబర్స్మెంట్ చేయడం అనేది ఒక ప్రహసనం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. హోలిస్టిక్ డెవలప్మెంట్ దిశగా విద్యా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.
మొత్తానికి:
మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రకటించిన జనసేన ఎడ్యుకేషన్ పాలసీ, ఆసక్తికరంగానే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాల్లో చాలా వరకు – ప్రభుత్వ ఆధీనంలో విద్యారంగం ఉండటం, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, ఇలాంటివి ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో అమలులో ఉన్నాయి. మరి సంప్రదాయక విధానంలో కాకుండా కొత్త తరహాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదన ప్రజలకు ఏ మేరకు నచ్చుతుందో వేచి చూడాలి.
ఉపసంహారం:
“ఫీజులు వసూలు చేయడం” , “ఫీజులు చెల్లించడం”, “ఫీజులు” ఇలాంటి పదాలు బహుశా చాలా చోట్ల వింటూ ఉంటాం, అగ్ర దిన పత్రికల్లో సైతం చూస్తూ ఉంటాం. నిజానికి ఇంగ్లీష్ లో ఫీ (fee) అన్న పదం singular అయితే ఫీజ్ ( fees) అన్న పదం దానికి plural . అప్పటికే plural అయిన ఫీజ్ ( fees) ని plural చేయడానికి తెలుగులో మళ్లీ ‘లు’ చేర్చి ఫీజులు అని అంటూ ఉంటారు. ఇది తప్పు అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే తెలుగు లో వచ్చే అగ్ర దినపత్రికల్లో సైతం ” ఫీజులు ” అని రాయడం పలుమార్లు చూస్తూ ఉంటాం. ఈసారి, మీరు చదివే అగ్ర దినపత్రికల్లో ఇలా వచ్చినప్పుడు ఒకసారి గమనించండి.
– జురాన్ ( @CriticZuran)