హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తునిలో జరిగిన పరిణామాలపై స్పందించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తాను నిన్న ఉదయమే హైదరాబాద్ నుంచి షూటింగ్ కోసం కేరళ వెళ్ళానని చెప్పారు. దీనిగురించి తెలియగానే వెనకకు వచ్చాని తెలిపారు. నిన్న ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. ఇది తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఏ సమస్యనయినా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని తాను భావిస్తానని అన్నారు. కాపులు బ్రిటిష్ కాలంనుంచి బీసీలుగా ఉన్నారని చెప్పారు. బీసీల్లో చేర్చాలనే డిమాండ్ కాపుల్లో చాలాకాలంనుంచి ఉందని అన్నారు. తమను ఓటుబ్యాంక్‌గా వాడుకుంటున్నారని కాపుల్లో బాధ ఉందని చెప్పారు.
రైలు అగ్గిపుల్ల వేస్తే కాలిపోదని అన్నారు. ఖచ్చితంగా కుట్రతోనే జరిగిందని చెప్పారు. దీనివెనక ఖచ్చితంగా అసాంఘిక శక్తులు ఉన్నాయని అన్నారు. ఎవరి ప్రోద్బలమో తనకు ఇంకా తెలియదని చెప్పారు. తునిలో ఇంత పెద్ద సభకు ఇన్ని లక్షలమంది హాజరవుతారని తెలిసికూడా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని అన్నారు. సమస్యను బాగా పెద్దదయ్యేవరకు చూసి అప్పుడు చర్యలు తీసుకోవటం మనకు బాగా అలవాటయిందని పవన్ చెప్పారు. ఉద్యమనేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని అన్నారు. తాను ఒక కులానికి ప్రతినిధిని కానని చెప్పారు. తాను జాతీయ సమగ్రత కోసమే రాజకీయాలలోకి వచ్చానని అన్నారు. ప్రభుత్వం ఉద్యమనేతలతో చర్చలు జరిపి వారికి నమ్మకం కలిగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు.